పేజీలు

25, ఏప్రిల్ 2022, సోమవారం

పాపం చేతిలో ఓడి విసిగి పోతున్నావా?

 

క్రీస్తు మన పాపముల నిమిత్తం సిలువలో తన ప్రాణం పెట్టి పునరుత్థానుడిగా మరణం గెలిచినట్లు గుడ్ ఫ్రైడే సందేశములలో ధ్యానించుకున్నాం కదా. "ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశించిపోకుండా రక్షించబడులాగున దేవుడు ఆయనను  అనుగ్రహించాడు" (యోహాను 3:16) అని దేవుని వాక్యం చెపుతోంది. అంటే యేసు క్రీస్తును నమ్మితే, అయన ఏవిధంగా పాపం లేకుండా బ్రతికాడో, ఆ సిలువలో మరణించి తిరిగి మూడవ దినం మరణం జయించి లేవటం ద్వారా అయన చెల్లించిన పాప పరిహారం మనకు వర్తింపచేసి ఆయనలోని నీతిని దేవుడు మనకు ఆపాదిస్తాడు. 

ఇది జరగాలంటే మనం కూడా పాపమును విడచి యేసు క్రీస్తువలె పవిత్రంగా జీవించటం మొదలు పెట్టాలి అనగా మారు మనసు పొందుకుని, ఇదివరకు చేసిన పాపములు దేవుని యెదుట ఒప్పుకొని, నూతనముగా జన్మించి, మన పాపములకు కారణం అవుతున్న సమస్త శరీర క్రియలకు ముగింపు పలకాలి. ఈ  పాపమూ మూలముగా క్రీస్తు మనకు బోధించిన, దేవునికి ఇష్టమయిన కార్యములు పాటించలేని వారిగా ఉండిపోతున్నాము. అసలు పాపం అంటే ఏమిటి? దాని నుండి బయటకు రావాలంటే ఏమి చేయాలి? వీటికి సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

యాకోబు 4: "17. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును."

1 యోహాను 3: "4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము." 

ఈ వచనముల ద్వారా పాపము యొక్క నిర్వచనములు మనకు అవగతం అవుతున్నాయి. పాపమూ రెండు రకములు, మొదటిది  చేయక పోవటం (Omission), ఏమి చేయక పోవటం? చేయగలిగినా మంచిని చేయకపోవటం పాపం.  రెండవది చేయటము (Commision), ఏమి చేయటము? చేయకూడని దానిని చేయటం పాపం. దీన్ని బట్టి  దేవుడు చెప్పిన మంచిని చేయక పోవటం పాపం, అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీరటం కూడా పాపం అని తెలుస్తోంది. 

యోబు 1: "5. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను."

దేవుని చేత సాతాను ముందు గొప్ప సాక్ష్యము పొందిన యోబు తన పిల్లలు యెక్కడ పాపమూ చేసి వారి హృదయములలో దేవుని దూషించిరేమోనని, బలులు అర్పిస్తున్నాడు. బైబిల్ చరిత్రకారుల ప్రకారం బైబిల్ లో రాయబడిన మొదటి గ్రంథం యోబు. అంటే అప్పటికి దేవుడు పది ఆజ్ఞలు ఇంకా వెల్లడి చెయ్యలేదు. కానీ యోబు తన పూర్వికులనుండి దహన బలులను ఆచరించటం తెలుసుకొని,  తన పిల్లల పాప పరిహారార్థం దేవునికి బలులను అర్పించటం చేసాడు. ఇదంతా యోబుకు దేవుడంటే ఉన్న ప్రేమ, భయ భక్తులను బట్టి చేశాడు. 

తద్వారా స్వస్థత కన్న నివారణ మేలు అన్న నానుడిని పాటిస్తూ తన పిల్లలను  దేవుని దృష్టికి పాపం లేని వారిగా మారుస్తున్నాడు. ఎటువంటి ఆజ్ఞలు లేకపోయినా అనగా ధర్మశాస్త్రము తెలియక పోయిన కేవలం మనసాక్షిని బట్టి దేవునికి ఇష్టం లేని పాపమును  తానూ, తన కుటుంబము చేయకుండా యోబు దేవుని యందు గొప్ప భయ భక్తుతులను చూపించాడు. ఆ విధంగా తనతో పాటు తన వారిని శుద్దీకరించుట ద్వారా దేవునికి  ఇష్టమయిన వాడిగా సాక్ష్యం పొందాడు. 

2 కొరింథీయులకు 13: "5. మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?"

పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో ఏమంటున్నాడు! మనలను మనం ఆత్మ పరిశీలన (Introspection) చేయుట ద్వారా, మనలో ఎటువంటి పాపం రాజ్యమేలుతోంది, ఏ క్రియలు మనలను చిక్కులు పెట్టి దేవుని కృపకు, అయన మహిమకు మనలను దూరం చేస్తున్నాయి గుర్తించాలి. మనం నిజంగా మారు మనసు పొందిన వారమయితే మనలో పాపం మన కళ్లముందు కనబడుతుంది. ఒక వేళ వాటిని సమర్థిస్తూ కారణాలు కనపడితే మనలో క్రీస్తు ప్రేమ లేనట్టుగానే భావించాలి. కనుక మనం ఎన్ని సార్లు కింద పడిపోతే అన్ని సార్లు ఎలాగయితే పైకి లేస్తామో, వంద సార్లు పాపం చేస్తే వంద సార్లు దేవుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగాలి.  

పాపములు ఒప్పుకోవటంలో కారణాలు,  సంజాయిషీలు ఉండరాదు.  తద్వారా మన స్థితిని మనం నిత్యం గుర్తించిన వారిగా ఉంటాము. నిత్యము పాపములు ఒప్పోకోవటం అంటే మనలను మనం ఖండించుకుంటూ బ్రతకటం కాదు కానీ, దేవుని కృప ద్వారా నిత్యమూ మనం క్రీస్తు లో నూతన పరచబడుతున్నాము అని ఆనందించాలి. క్రీస్తు రక్తములో క్షమించబడలేని పాపమూ లేదు అని ఎరిగి, మన పాపములు క్షమించబడ్డాయి అని విశ్వసించాలి. పాపముల ఒప్పుకోలు ద్వారా పరిశుద్దాత్మను పొందుకొని ఆ పరిశుద్దాత్మ నడిపింపు ద్వారా ఆ క్రియలను చేయకుండా దేవుని శక్తిని పొందుకుంటాము (అపొస్తలుల కార్యములు 2:38).  

మనం పాపముకు లొంగిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?  మొదటగా, దేవుడి యెడల భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు మనకు తన నియమ నిబంధనలు గుర్తు చేస్తూ ఉంటాడు (కీర్తనలు 25:12).  మరియు ఆ పాపమును గుర్తించటానికి కావలసిన జ్ఞానమును,  జయించటానికి అవసరమయిన శక్తిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. యాకోబు కుమారుడు యోసేపు ఆనాడు పాపం చేయక పోవటానికి గల కారణం, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండటమే.  కనుకనే  యోసేపు  దేవునికి విరోధముగా పాపము ఎలా చేయగలను అని పాపం చేయమన్న పోతీఫరు భార్యను నిలదీశాడు (ఆదికాండము 39:9)

రెండవదిగా, పాపమూ నుండి పారిపోవటం. యోసేపు తన వస్త్రమును కూడా వదిలి పెట్టి పోతీఫర్ భార్య నుండి దూరంగా పారిపోయాడు (ఆదికాండము 39:12) రాసి ఉంది. కానీ దావీదు మాత్రం స్నానం చేస్తు కంటపడిన బత్షెబ గురించి అరా తీసాడు. పొరపాటున చూసాను అని వదిలిపెట్టకుండా, ఎవరు ఏమిటి అని తెలుసుకొని ఆమెను పిలువనంపాడు (2 సమూయేలు 11:1-3). తద్వారా తన కోరికను జయించలేక, పాపములో పడిపోయాడు.  

2 తిమోతికి 2: "22.  నీవు యావనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము." 

పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రికలో నీ యవ్వన కోరికలనుండి పారిపోమ్మని హెచ్చరిస్తున్నాడు. అపవిత్రపు  దృశ్యములు, నేత్రాశలకు అలవాటుపడిన ప్రియా సహోదరి, సహోదరుడా! సమయం మించిపోలేదు. నీకు కలిగే కోరికలనుండి దూరంగా పారిపో! ఆ సెల్ ఫోన్ స్విచ్ అప్ చేయు, ఆ లాప్టాప్ మూసేసి బయటకు వెళ్ళిపో! నువ్వు టీవీ లో చూసే ఆ ఆకతాయి కార్యక్రమం యేసయ్య నీతో ఉండి చూడగలడా? చూడలేడు అనిపిస్తే ఆ ఛానల్ మార్చెయ్! "ఎల్ల వేళలా మంచి ఆత్మీయ స్థితిలో ఉన్న వారితో ప్రార్థిస్తూ, దేవుని యందు విశ్వాసముతో అయన నీతిని, ప్రేమను, సమాధానమును వెతుకుమని" పౌలు గారు చెప్పినది  పాటిద్దాము.  

మూడవదిగా, దేవునికి వాక్యము ధ్యానించుట. ధ్యానించటమే కాకుండా వాక్యమునకు లోబడు వారిగా ఉండాలి. అనగా అయన ఆజ్ఞలను నిత్యమూ గైకొని అనగా పాటిస్తూ జీవించాలి. తద్వారా సాతానును ఎదిరించే శక్తి మనకు వస్తుంది! అప్పుడు  వాడు మననుండి దూరంగా పారిపోతాడు (యాకోబు 4:7). సాతాను యేసయ్యను శోధించినప్పుడు వాడిని ఎలా ఎదురుకొన్నాడు? పాత నిబంధనలో వాక్యములు చూపించి ఆయనను చిక్కులు పెట్టాలనుకున్నప్పుడు వాడికి సమాధానంగా దేవుని వాక్యాలనే ఉటంకించాడు కదా! తద్వారా వాడిని తన నుండి పారిపోయేలా చేసాడు. 

కీర్తనల గ్రంథము 119: "11.  నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను." 

తను రాసిన కీర్తనలో దావీదు దేవుని వాక్యమును బట్టి ఏమంటున్నాడు! "నీ ఎదుట పాపము  చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను" అని. అనగా దేవుని వాక్యము మన హృదయములో ఉంచుకోవాలంటే, దానిని నిత్యమూ ధ్యానించాలి, మరియు దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. బైబిల్ లో ఉన్న వాక్యాలు ఉన్నదున్నట్లుగా గుర్తు ఉండవలసిన అవసరం లేదు కానీ, దేవుడు ఆ మాటలు ఎందుకు రాయించాడో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే వాటిని మనం పాటించగలం! శోధనలు ఎదురయినప్పుడు వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకొని వాటిని ఎదురించగలం. లేదంటే నామమాత్రంగా రోజు బైబిల్ చదివితే ఉపయోగం ఉండదు కదా! 

నాలుగవదిగా మనం చేయవలసింది నిత్యము ప్రార్థించటం. ప్రార్థన అనేది కేవలం మన అవసరములు దేవునికి తెలుపడటానికి మాత్రమే కాదు, ఆయనతో మాట్లాడటానికి, ఆయనను ఆరాదించటానికి మరియు మన పాప దోషములు ఒప్పుకోవటానికి కూడా చెయ్యాలి. నిరంతరం ప్రార్థించటం వలన దేవుని సాంగత్యం లేదా సహవాసము మనతో ఉంటుంది. యేసయ్య తన శిష్యులను శోధనలో పడిపోకుండా ఎడతెగక ప్రార్థించమన్నాడు కదా! చాల సార్లు మనకు పాపం చేయటం ఇష్టం లేకపోయినా శోధనలో పడిపోతూ ఉంటాము. 

ఎందుకంటే మన ఆత్మ సిద్ధపడినా గాని శరీరము బలహీనమయినది (మత్తయి 26:41 ) అందులో ఏ మాత్రము పవిత్రమయిన కార్యములు గాని, ఆలోచనలు గాని పుట్టవు. మన శరీరము బలహీనమయినది, కనుక దేవుని సన్నిధి మనకు ఎల్ల వేళలా తోడుగా ఉండటం శోధనను జయింపజేస్తుంది.

చివరగా, వీటన్నింటితో పాటు నిత్యమూ దేవుని కృపను పొందు అర్హత కలవారిగా ఉండాలి. తద్వారా పాపమూ మన మీద అధికారము చేయని వారిగా మారిపోతాము (రోమీయులకు 6:14). దేవుని కృప ఎవరికి లభిస్తుంది? దీన మనసు కలిగిన వారికి అనగా అహంకారము విడిచిన వారికి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి, దినులకు తన కృపను అనుగ్రహిస్తాడు (1 పేతురు 5:5). పైన చెప్పిన అన్ని విషయాలు తూచ తప్పకుండా పాటించిన, అహంకారులమయితే దేవుని కృపకు నోచుకోని వారిగానే ఉంటాము, పాపములో పడిపోతూనే ఉంటాము. 

క్రీస్తునందు ప్రియమయిన మీకు మనవి చేయవలసిన ముఖ్యమయిన విషయము,  దేవుడు కరుణ స్వరూపుడు, తనను వేడుకొన్న వారిని త్రోసిపుచ్చని స్వభావము కలిగి ఉన్నవాడు (యోహాను 6:37). కనుక నిరాశపడకుండా నిత్యమూ మన పాపములు ఒప్పుకుంటూ అయన కృపకు పాత్రులుగా ఉందాము. దేవుడు చూసేది, పవిత్రంగా ఉండాలనుకునే మనసును, అలాగే పాపంలోంచి బయటపడాలనుకునే తపనను (2 కొరింథీయులకు 8:12). మన శరీరము బలహీనమయినదని శరీర దారిగా మన మధ్య తిరుగాడిన మన రక్షకుడయిన యేసయ్య ఎరిగియున్నాడు 

దావీదు "నేను పాపమూ చేసితిని" అని నాతానుతో తన పాపం ఒప్పుకోగానే,  నాతాను "నువ్వు చావకుండునట్లు దేవుడు నీ పాపమూ పరిహరించెను" అన్నాడు (2 సమూయేలు 12:13). దావీదు చేసిన వ్యభిచారము, నర హత్యను కూడా ఒప్పుకోగానే క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. అయన  ముందు పాపం ఒప్పుకుని పశ్చాత్తాపపడు,  ఎన్నిమార్లయినా క్షమించటానికి అయన సిద్ధముగా ఉన్నాడు, కానీ అయన ప్రేమను, కృపను అలుసుగా తీసుకోవద్దు. 

కృప ఉంది కదా అని బుద్ది పూర్వకముగా పడిపోయే వారి నిమిత్తం ఇంకా బలి ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 10:26). ఆలా పడిపోతూ అయన చిత్తములో నుండి తొలగిపోవద్దు. ఏడ తెగక ప్రార్థించు, నిత్యము అయన వాక్యము ధ్యానించు, ఈ పాపము  నుండి విడుదల కావాలని అయన ముందు మోకరించి రోధించు, నిన్ను విజయుడిగా ఆయనే మార్చుకుంటాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! నిజాయితీగా నీ ప్రయత్నాలు చేస్తూ, పడిపోయిన కూడా దేవుడు నీ హృదయపు సిద్ధపాటును బట్టి, పాపముపై నీకు ఉన్న నిరసనను బట్టి అయన  నిన్ను తప్పక క్షమిస్తాడు. మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటే "ఇక మీదట నీ పాపములు ఏమియు నేను గుర్తుంచుకోను" అని సెలవిచ్చిన దేవుడు, నిన్ను వదిలేయాడు. "సగం మునిగాం కదా, ఇంకా చలి దేనికి" అనుకుని అందులోనే ఉండిపోతే! నువ్వు ఉందనుకుంటున్న మారు మనసు నీలో లేదేమో ఒక్కసారి పరిశీలించి చూసుకో! 

దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి