19, జూన్ 2021, శనివారం

ప్రభువు రాకడకు సిద్దపడుతున్నావా?

ప్రభువు నందు విశ్వాసముతో మారు మనసు పొంది, నూతనముగా జన్మించి, ప్రభువయినా యేసు క్రీస్తును హృదయములలో నిలుపుకుని, అయన ప్రేమను ప్రతిఫలింపఁజేయ ప్రయత్నం చేస్తున్నారా? అయన రాకడకు సిద్దపడుతున్నారా? ప్రస్తుతం లోకములో జరుగుతున్నా పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉంటున్నాయి. యేసు ప్రభువు తన రెండవ రాకడను బట్టి అయన బోధనలలో ప్రవచించిన విషయములవలే గోచరిస్తున్నాయి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్న మాటలు చూడండి క్రింది వచనంలో:

ఎఫెసీయులకు 5: "15. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, 16.  అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి."


దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగము చేసుకొమ్మని, అజ్ఞానుల వలే కాక జ్ఞానులవలె నడచుకోవాలని హెచ్చరిస్తున్నాడు పౌలు. విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో ఉన్నంత ఆరాటం, దేవుడి మీద ఇష్టం తగ్గిపోతూ ఉంటాయి చాలామందిలో. రాను రాను మునుపటి స్థితికి కూడా వెళ్ళిపోతారు. తేడా ఒక్కటే ఏమిటంటే, అప్పుడు అన్యులుగా ఉన్నారు, ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? దేవుడి అనంత ప్రేమను వారు తెలుసుకున్నారు. ఏం చేసిన క్షమిస్తాడు, మరోసారి "క్షమించు ప్రభువా" అని రొట్టె, ద్రాక్షరసం తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు.  మనలను మనం మోసం చేసుకోవచ్చు కానీ, దేవుణ్ణి మోసం చేయలేము. ప్రతి హృదయము తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. వాటిని బట్టే మనకు తీర్పు తీర్చబోతున్నాడు. నువ్వు నిజంగా మారాలని ఆరాటపడుతున్నావా! నీ శరీరంతో పోరాటం చేస్తూ ఓడిపోతున్నావా, లేక పరిశుద్దాత్మ గద్దింపును లెక్కచేయక బుద్ధిపూర్వకంగా పడిపోతున్నావా? అదే నిజమయితే నీ ప్రయాణం ప్రభువు రాకడ వైపు సాగటం లేదు. 

యవ్వనస్తులారా, కొన్ని నిమిషాల సుఖం కోసం దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు తప్పిపోకండి. నిన్ను జగతు పునాది వేయక ముందే అయన ఏర్పరచుకున్నాడు. కనుకనే నీకు ప్రభువునందు విశ్వాసం కలిగింది. ఎందుకంటే ప్రతి వాని విశ్వాసమునకు కారణభూతుడు ఆయనే. వేయిమంది భార్యలు, సర్వ సౌఖ్యాలు అనుభవించిన సొలొమోను ఏమని రాస్తున్నాడు ప్రసంగిలో ఒక్కసారి చూడండి!

ప్రసంగి 12: "1. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2.  తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము."

సొలొమోను గారు అన్ని అనుభవించిన తర్వాత వాటిలో ఏ సుఖం లేదని ముసలి ప్రాయంలో ఈ విషయాలు రాస్తున్నారు. అయన విషయంలో ఆలస్యం జరిగిపోయింది. కనుకనే మనలను హెచ్చరించే ఈ మాటలు దేవుడు తన గ్రంథంలో అనుమతించాడు. బాల్యమునందే దేవుణ్ణి తెలుసుకొని నడుచుకొనుట, ఆయనను స్మరించుట మేలయినదని తెలుపుతున్నాడు. మనకు ఇంకా సమయం ఉంది అనుకోని వ్యర్థమయిన, అశాశ్వతమయిన వాటికై అణగారిపోకండి. ప్రభువు రాకడ  ఎప్పుడో ఎవరికీ తెలియదు!

2 పేతురు  3: "10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన 11.  ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, 12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను."

ప్రభువు దినము దొంగవలే వస్తుందని పేతురు గారు రాస్తున్నారు. యేసు క్రీస్తును శిష్యులు ఆ దినము గురించి అడిగినప్పుడు తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పారు. కనుకనే ఆ దినము చెప్పకుండా, దొంగవలే వస్తుందని పరిశుద్దాత్మ పలుమార్లు రాయించాడు. దొంగను ఎదురుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? గట్టిగా తలుపులు బిగించి తాళలు వేసేసి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఆలాగుననే మనం కూడా ఆత్మీయంగా పరిశుద్దమయిన ప్రవర్తనతో, భక్తితో జాగ్రత్తగా ఉండాలని పేతురు గారు రాస్తున్నారు. 

1 థెస్సలొనీకయులకు  5: "4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు. 5.  మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. 6.  కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము."

పరిశుద్దాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించి పై వచనం  రాయించాడు చూడండి. దొంగ వలే వచ్చు ఆ దినమునకు భయపడటానికి మనం చీకటిలో ఉండువారం కాదు. దొంగ ఎప్పుడు చీకటిలోనే వస్తాడు కనుక చీకటిలో ఉన్నవారు మాత్రమే ఆ దినమును గురించి భయపడతారు.  కానీ మనము క్రీస్తు ద్వారా  నిత్యమూ వెలుగులో కొనసాగువారము. మన వెలుగు దేవుని వాక్యము మరియు  ప్రభువయినా యేసుక్రీస్తు. చీకటిలో ఉన్నవారు ఆత్మలో నిద్రపోతారు. లోకరీతులకు ఆకర్షితులయి, తాగుబోతులుగా, దుర్నీతిని అనుసరిస్తూ సాతాను సంబంధులుగా ఉంటారు.  కానీ వెలుగులో ఉన్న మనము మెలుకువగా ఉండవలెనని పౌలుగారు మనలను ప్రోత్సహిస్తున్నారు. మెలకువగా ఉండటం అంటే ఏమిటి? 

1 థెస్సలొనీకయులకు  5: "15. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. 16. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; 17. యెడతెగక ప్రార్థనచేయుడి; 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. 19. ఆత్మను ఆర్పకుడి. 20.  ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. 21.  సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. 22.  ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి." 

పై వచనములలో చెప్పిన విషయాలు కష్టతరంగా తోయటం సహజమే. కానీ అసాధ్యమయిన విషయాలు మాత్రం కావు. కీడుకు ప్రతి కీడు చేయక పోవటం, మనుష్యులందరికి మేలు చేయటం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం. ఆలాగుననే ఏడ తెగక ప్రార్థన చేయటం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం,  ఎందుకంటే దేవుడు మన మేలు కొరకే దేనినయినా అనుమతిస్తాడు గాని మనకు కీడు చేయుటకు మాత్రం కాదు. 

ఆత్మను మండే స్థితిలో ఉంచుకోవటం, అంటే పరిశుద్దాత్మ గద్దింపును అనుసరించటం ప్రాముఖ్యమయినది. ఆలాగుననే ప్రవచనములు నిర్లక్ష్యం చేయక, ప్రతి దానిని విచారించి మేలయినది ఆచరించటం. అనగా లోక రీతిని బట్టి కాకుండా దేవుని వాక్యములో నుండి గ్రహించి పాటించటం. మరియు సమస్తమయిన కీడుకు దూరంగా ఉండటం. 

వీటన్నింటికి కట్టుబడి ఉన్ననాడు, పరిశుద్దాత్మ దేవుడు మనలను నడపటానికి తోడుగా ఉంటాడు, మనలను పిలుచుకున్న దేవుడు నమ్మకమయినవాడు. ప్రభువయినా యేసుక్రీస్తును ప్రేమించిన దేవుడు మనలను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. అయన చిత్తమును నెరవేరుస్తూ, అయన ఆజ్ఞలు పాటించటమే మనం చేయవలసింది. 

1 థెస్సలొనీకయులకు  5: "9. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు."

పై వచనము చూడండి ఎంత ధైర్యం నింపుతుంది. దేవుడు మనలను ఏర్పరచుకున్నది ప్రభువయినా యేసుక్రీస్తు ద్వారా రక్షించటానికే గాని మన పాపముల నిమిత్తం శిక్షించటానికి మాత్రం కాదు. దేవుడు తలపెట్టిన కార్యములు పూర్తీ చేయకుండా వదిలిపెడుతాడా? నిన్ను రక్షించటానికే కదా విశ్వాసం ఇచ్చింది! అయన మార్గములు అనుసరిస్తే చాలు నిన్ను మార్చుకోవటం ఆయనకు అసాధ్యమా?  కనుక సహోదరి, సహోదరుడా - ప్రభువు రాకడకై సిద్ధపాటులో  అలక్ష్యం వలదు! రక్షణ విషయంలో నిర్లక్ష్యం కూడదు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక

15, మే 2021, శనివారం

దేవుడు ప్రేమలేని వాడా?

దేవుని స్వభావమును ఎరిగిన వారు ఎవ్వరు కూడా దేవుడు ప్రేమలేని వాడని ఆలోచించలేరు! కానీ ప్రస్తుతం జరుగుతున్నా పరిస్థితులను బట్టి, లోకంలో చెలరేగిపోతున్న కరోనా విలయ తాండవం ద్వారా నశించిపోతున్నా ప్రజలను బట్టి, మరణాల సంఖ్యను బట్టి, ఇటువంటి ప్రశ్నలు తలెత్తడం అత్యంత సహజమే. దేవుడు ఎన్నోమారులు తన ప్రేమ స్వభావమును ప్రత్యక్ష పరచుకున్నాడు. అయన ఎంత ప్రేమమయుడో తెలుకోవాలంటే పవిత్ర బైబిల్ గ్రంథం నుండి ఒక రాజు గురించి  తెలుసుకుందాం. 

అతను దేవుని కృపను పొంది, 15 సంవత్సరాలు అధిక ఆయుష్షు పొందిన హిజ్కియా కుమారుడయినా మనష్షే. ఇతని గురించి బైబిల్ గ్రంథం అత్యంత హీనమయిన వాడని సెలవిస్తోంది. 

2 దినవృత్తాంతములు 32: "33.  హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియ లను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను."

2 దినవృత్తాంతములు 33: "1. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబది యయిదు సంవత్సరములు ఏలెను. 2.  ఇతడు ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా వెళ్ల గొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడునడత నడచెను."

పై వచనములు చూస్తే ఇతని ప్రవర్తన ఏమిటో తెలుస్తుంది. మోషే ధర్మ శాస్త్రమును తృణీకరించాడు. దేవుని మందిరములో తానూ చేయించిన దేవత విగ్రహ మూర్తులను ప్రతిష్టింప జేశాడు. యాబై ఏళ్ళుగా ప్రజలను రాచి రంపాన పెట్టాడు, ప్రజలకు దేవుణ్ణి పూర్తిగా దూరం చేసాడు. అప్పుడు దేవుడు మనష్షే మీదికి అష్షూరు రాజు సైన్యాధిపతులను రప్పించాడు. అతడు బబులోనుకు బందీగా తీసుకోనిపోబడ్డాడు. ఆసమయంలో అతని అహంకారం పూర్తిగా అణగారి పోయింది. 

2 దినవృత్తాంతములు 33: "12.  అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని. 13. ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను."

పై వచనములలో అతను దేవునికి తనను తాను తగ్గించుకొని ప్రార్థించగా తిరిగి అతణ్ణి  రాజ్యములోకి తీసుకోని వచ్చాడు. అసలు ఇది సాధ్యమేనా? బందీగా వెళ్లిన ఏ రాజయిన తిరిగి తన రాజ్యంలోకి రావటం జరుగుతుందా? దేవుని కార్యం కాక మరేమిటి? అందుకే మనష్షే దేవుని గొప్పతనం తెలుసుకున్నాడు. అప్పటి నుండి తానూ కట్టించిన ఇతర దేవతల విగ్రహాలు కూలిపించాడు, బలి పీఠములు బద్దలు కొట్టించాడు. దేవుడయినా యెహోవాను మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించాడు. పశ్చాత్తాప పడిన ఒక దుర్మార్గపు రాజుకు దేవుని క్షమాపణ లభించింది. తనను యాభై ఏళ్ళుగా నిరాకరించి, తన ప్రజలను తనకు దూరం చేసిన వాడిని, క్షమించి ఆదుకున్న దేవునికి ఎంత ప్రేమ ఉండాలి? ఇటువంటి సంఘటనలు ఎన్నో, మరెన్నో బైబిల్ నందు మనం చూడవచ్చు. 

సహోదరి, సహోదరుడా ఒక్కసారి ఆలోచించు! ప్రపంచం ఎటువైపు వెళ్తోంది. ఎటు చూసిన అశ్లిలత, విచ్చలవిడితనం, మోసాలు, నేరాలు. ఆఖరికి దేవుడి పేరిట కూడా వ్యాపారం. మరి దేవుడు వీళ్ళందరినీ దారికి తీసుకు రావాలి కదా? మానవులు పశ్చాత్తాప పడి సక్రమ మార్గంలో సాగాలి కదా? డబ్బు ఉందన్న గర్వం కూడా ఎవరిని కాపాడలేక పోతోంది. ఈ మాటలన్నీ దేవుడు ఏనాడో తన గ్రంథంలో రాయించాడు. 

జెఫన్యా 1: "18. ​యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు."

పేద లేదు, ధనిక లేదు అందరు ఏక రీతిగా కష్టాలు అనుభవిస్తున్నారు, చావు నుండి తప్పించుకోలేక పోతున్నారు. డబ్బు ఉండి కూడా సరైన వైద్యం అందక చనిపోతున్న వారు ఎందరో! చనిపోయిన వారందరు చెడ్డవారని నేను చెప్పటం లేదు! కానీ దేవుని కరుణ పొందాలంటే ఆయనను ఆశ్రయించటమే తుది అగత్యము. అభివృద్ధిని చూసి, సాంకేతితను చూసి దేవుడి ఉనికినే ప్రశ్నించిన ప్రపంచం, కంటికి కూడా కనపడని కీటకంతో యుద్ధం చేస్తోంది. 

జెఫన్యా 2: "15. నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచార ముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గ మున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు." 

పై వచనం చూడండి, నా వంటి వారు లేరు, నాకున్న రక్షణ కోటలు ఎవరు ఛేదించగలరు అని గర్వపడిన ఒక పట్టణము ఎలా నశించిపోతుందో దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా చెపుతున్నాడు. మానవాళి కూడా అటువంటి గర్వంతోనే నిండియుండి. మనకున్న టెక్నాలజీకి దేన్నైనా సాధిస్తాం అనుకుంది, చివరకు దేవుడు ఉన్నడా అన్న దగ్గరి నుండి అసలు దేవుడి అవసరమే మానవాళికి లేదు, సృష్టి అంత దానంతట అదే ఉద్బవించింది అన్న దగ్గరికి వచ్చేసారు. ఇది మూర్కత్వం కాక మరేమిటి? సృష్టి కర్తను మరచి సృష్టిని ఆరాధించే వారు కొందరు, అసలు సృష్టికర్తే అవసరం లేదు అనే వారు మరికోందరు! 

ప్రియా సంఘమా, సమయం లేదు! త్వరపడు. ప్రభువు చెప్పిన తన ఘడియలు రావటానికి ఎంతో కాలం పట్టదు సుమా. ఇంతవరకు ప్రభువు నందు విశ్వాసములో పడుతూ లేస్తూ సాగుతున్నావేమో, కానీ ఇప్పుడు పరుగు పెట్టటమే ఆవశ్యకం!  వద్దు! ఆ చెత్త సీరియల్స్ ఆపేయ్, ఆ కుళ్ళు జోకుల ప్రోగ్రామ్స్ మానెయ్! ఆ బూతు సినిమాలు చూస్తు నీ హృదయమును అపవిత్రం చేసుకోకు, ఆత్మీయతలో నశించి పోకు! వారందరు యుగ యుగములు దహించబడటానికి సిద్ధంగా ఉన్నవారు. కానీ నీవు దేవుడి చేత ఎన్నుకోబడ్డావు. చివరికి తప్పిపోతావా? దేవుని దుఃఖముకు కారణం అవుతావా?

జరుగుతున్నా విపత్తులను చూసి అధైర్యపడవద్దు. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో కూడా నీకు తెలియదు. కానీ దేవునికి వాటి సంఖ్యలు కూడా తెలుసు! అంటే ఏది మొదటిది, ఏది రెండవది ఈ విధంగా అయన నిన్ను ఎరిగి ఉన్నాడు. అయన చిత్తం లేకుండా  నిన్ను ఏది ఏమి చెయ్యలేదు. ఆలా అని విచ్చలవిడిగా తిరగవద్దు.  ఐగుప్తు లో చివరి తెగులు సంహార దూత వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారిని భయట తిరగమనలేదు, గొర్రె పిల్ల రక్తం తమ ఇంటి ద్వారాలకు పూసుకొని ఇంట్లో భద్రంగా ఉండమన్నాడు. మనం చేయవలసింది కూడా అదే! 

2 దినవృత్తాంతములు 7: "14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును."

పై వచనములో దేవుడు మన నుండి ఆశిస్తున్నా ప్రవర్తనను సెలవిస్తున్నాడు. మన పాప దోషములు గుర్తించి దేవుని క్షమాపణకై మొఱ్ఱ పెట్టవలెను, తద్వారా అయన మన పాపములను క్షమించి, మనం నివసించు దేశమును స్వస్థపరుస్తాడు.  ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అల్ప జ్ఞానులము అయినా మనకు అందని సమాధానాలు. కొందరు స్వాములు ఫలానా నెలకు కరోనా తగ్గిపోతుంది అంటారు, కానీ ఏ సంవత్సరమో చెప్పరు, ఎప్పుడు తగ్గితే అప్పుడే అని మాట మార్చేయొచ్చూ.  కానీ మన దేవుడు ఆలా కాదు ప్రియులారా! అయన నరుడు కాదు మాట ఇచ్చి తప్పటానికి! భూమ్యాకాశాలు గతించిన అయన మాట గతించిపోదు. ఎందుకంటే అయన ఆది, అంతం లేని వాడు, సజీవుడు, ఉన్నవాడు. అయన ప్రేమ నిత్యం,  అయన మార్గం సత్యం. దేవుడికి మరో పేరే ప్రేమ అని మనకు బైబిల్ లో ఏ పుస్తకములో ఏ అధ్యాయం చదివిన అవగతమవుతుంది. కనుక అధైర్యపడి విశ్వాసం కోల్పోవద్దు, కడవరకు సాగిపోదాము, పరలోకం  చేరేవరకు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! 

17, ఏప్రిల్ 2021, శనివారం

ప్రసంగం చెయ్యాలనుకుంటున్నావా?

బైబిల్ చదవటం మొదలు పెట్టిన తర్వాత ప్రతి విశ్వాసి ఆశపడే విషయం ఏమిటంటే, తనకు తెలిసిన మరియు  అర్థం అయిన  దేవుని మాటలు తోటి వారితో పంచుకోవాలని. తద్వారా వారికి ఆదరణ కలిగించటంతో పాటు వారి విశ్వాసమును బలపరచటం మరియు దేవుడు తమతో మాట్లాడిన పలుకులు సాక్ష్యముగా పంచుకోవటం జరుగుతుంది. పరిశుద్దాత్మ దేవుడు సంఘము క్షేమాభివృద్ధి దృష్ట్యా మనకు కొన్ని ఆత్మీయ వరములు అనుగ్రహిస్తాడు! ఇదివరకు మనం తెలుసుకున్నాం. వాటిలో ఒక్కటి,  బోధ చేయటం లేదా ప్రసంగం చేయటం. అయితే దేవుని వాక్యములో చెప్పబడిన కొన్ని హెచ్చరికలు గమనించి బోధచేయటం మంచిది.

యాకోబు 3: "1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి."

పై వచనములో యాకోబు గారు ఏమంటున్నారు? బోధకులయినా వారికి తీర్పు కఠినముగా ఉంటుందని తెలుపబడింది.  ఎందుకు? పరిశుద్దాత్మ నడిపింపు లేకుండా, దేవుని పిలుపు లేకుండా బోధించినట్లయితే కేవలం తమకున్న లోక జ్ఞానమును బట్టి దేవుని మాటలు బోధించిన వారుగా మారిపోతారు. తద్వారా సాటి సహోదరులకు లేదా సంఘమునకు వాక్యమునకు విరుద్ధముగా బోధించి వారిని నశింపచేసిన వారు అవుతారు కనుక. సహోదరి, సహోదరుడా! యేసయ్య ప్రేమ నీలో నిజంగా ఉందా? నీ జీవితం అయన ఆశించినట్లుగా కొనసాగుతుందా? ప్రభువు అనుమతి నీకు ఉందా? లేక సంఘములో పెద్దలు ప్రోత్సహిస్తే నాలుగు మాటలు ఇంటర్నెట్ లో చూసి, వ్యాఖ్యానాలు చదివి మాత్రమే మాట్లాడుతున్నావా? ఇంటర్నెట్ లో సంచికలు చూడటం, వ్యాఖ్యానాలు చదవటం తప్పు అని చెప్పటం లేదు! కానీ నిశ్చయముగా వాటిని నమ్ముతున్నావా? దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? కనీసం జీవించటానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు చెప్పే విషయం మీద  పూర్తీ అవగాహనా పొందుకున్నావా? 

1 తిమోతి 1: "7. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి."

పౌలు గారు తిమోతి తో ఏమంటున్నారు గమనించండి! కొంతమంది దేవుని వాక్యము మీద పూర్తి అవగాహనా లేకుండా, వాటిని పూర్తిగా నమ్మక పోయినను బోధకులుగా మారిపోతున్నారు. తమ జ్ఞానము చొప్పున లోకపరమయిన ఉదాహారణలతో,  ఛలోక్తులతో ప్రసంగం చేస్తూ ఉంటారు! ప్రసంగంలో ఎన్ని లోకపరమయిన ఉదాహరణలు ఉంటె అంతగా ఆ బోధకుడు సిద్దపడి రాలేదు అని అర్థం! బైబిల్ బోధించటానికి బైబిల్ లో లేని ఉదాహరణలు, సంఘటనలు దేనికి? ఏదయినా విషయాన్నీ విశదీకరించటానికి ఉపయెగించటం తప్పు కాదు, కానీ సినిమాల ఉదాహరణలు సైతం ప్రసంగంలో ప్రస్తావించటం, విశ్వాసులకు ఎటువంటి సందేశాలు అందిస్తుంది? పాస్టర్ గారు సినిమా ఉదాహరణ చెప్పారు కాబట్టి, సినిమాలు చూడటం తప్పు కాదన్నమాట అని సంఘం అనుకొంటే తప్పు ఎవరిదీ? ఆ బోధకునికి తీర్పు ఎలా ఉంటుంది? 

మత్తయి 15: "14. వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను." 

పై వచనంలో యేసు క్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు! పరిసయ్యులు గ్రుడ్డి వారిగా ఉన్నారు, మరియు వారు ఇతరులకు త్రోవ చూపుతూ వారిని కూడా గ్రుడ్డి తనములో నడుపుతున్నారని. ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారని. సొంత జ్ఞానమును బట్టి బోధించు వారు, సంఘమునకు ఆనుకూలంగా బోధించువారు అంటువంటి వారె. ఇటువంటి బోధ వలన సంఘములో  ఎంటువంటి అభివృద్ధి ఉండబోదు. ప్రతి ఆదివారం మందిరమునకు వస్తున్నాం, చాల భక్తిపరులుగా ఉన్నాం అన్న భ్రమలో విశ్వాసులను ఉంచుతున్నారు. దేవుని ప్రేమతో పాటు, అయన రోషమును కూడా బోధించాలి. పవిత్రత యొక్క ప్రాముఖ్యత, రక్షణ యొక్క విశిష్టత వివరించాలి మరియు మారు మనసు యొక్క ఆవిశ్యకతపై అవగాహనా పెంచాలి. అలాగ జరుగనిచో సంఘమంతా కూడా ఒకప్పుడు నీకొదేము వలే  యేసయ్య  చేత గద్దింపబడినట్లుగా ఉండిపోతుంది. 

యోహాను 3: "9. అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా 10.  యేసు ఇట్లనెనునీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?11.  మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

"తిరిగి జన్మించాలి" అన్న యేసయ్య మాటలను నీకొదేము అర్థం చేసుకోలేని సందర్భంలో  యేసయ్య  నీకొదేముతో అన్న మాటలు పై వచనంలో చూశాం కదా. బోధకుడైన నీకొదేము ఈ సంగతులన్నియు ఎరిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్దాత్మ ఈ సంగతులను ఏనాడో పాత నిబంధన గ్రంథంలో రాయించాడు  (యెహెజ్కేలు 11:19 మరియు యిర్మీయా 32:39-40). 

కారణం ఏమయినప్పటికీ ఈ సంగతులు ఇశ్రాయేలు వారికి యేసయ్య వచ్చే వరకు బోధింపబడలేదు. బోధ అనేది తల్లి, తండ్రుల నుండి సంక్రమించే ఆస్థి కాదు. దేవుని పిలుపు! ఎటువంటి అవగాహనా లేని చిన్న చిన్న పిల్లలతో కంఠస్థం చేయించి ప్రసంగాలు చేయిస్తున్నారు. ఏ అనుభవ జ్ఞానము లేని తమ పిల్లల చేత బలవంతంగా, సంఘము ముందు నిలబెట్టి, దేవుని వాక్యాలు వల్లే వేయిస్తున్నారు. ఆ సంఘము ఎటు వైపు వెళుతుంది? ప్రసంగం అంటే నాలుగు బైబిల్ వాక్యాలు గుర్తుంచుకొని  అర్థం చెప్పటం కాదు! దేవుని  మాటలు సంఘమునకు తెలపటం! విశ్వాసుల ఆత్మలకు ఆత్మీయ ఆహారం అందించటం. అంటువంటి భాద్యత నిర్వహించటానికి దేవుడు ఎవరిని పడితే వారిని ఎన్నుకుంటాడా? మరి ఎవరిని ఎన్నుకుంటాడు? 

యిర్మీయా 15: "19. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెనునీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు"

పై వచనములో ప్రవక్త అయినా యిర్మీయా తనకు వస్తున్న శ్రమలను బట్టి తనను తానూ నిందించుకొని, నిరాశను వెలిబుచ్చినప్పుడు, దేవుడు తనతో అంటున్న మాటలు చూడండి! నిరాశను వదిలి, శ్రమలను బట్టి దుఃఖపడక ఉంటె తన సన్నిధికి తిరిగి రప్పిస్తానని అంటున్నాడు. ఏవి నీచములో, ఏవి ఘనములో ఎరిగి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే తన నోటివలె ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఇతరులు నీలాగా మారాలి కానీ నీవు వారి వలె మారకూడదు. అనగా లోకమంతా చెడు వైపు నడచిన నీవు మాత్రం వారికి ఆదర్శంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటువంటి ప్రవర్తన నీకు అలవడిందా? మంచి, చేడు  గుర్తించి లోకములో ప్రత్యేకించినట్లుగా ఉంటున్నావా? లేక నూటికి తొంబై తొమ్మిది మంది అలాగే ఉన్నారు నేను కూడా అలాగే ఉండాలి కాబోలు అని ప్రసంగంలో కూడా అటువంటి ఉదాహరణలు, అంటువంటి ఛలోక్తులు కలుపుతున్నావా? సహోదరి సహోదరుడా! దేవుని నోటి వలె ఉండటం ఎంతో ధన్యమయిన విషయం. దానిని చులకనగా తీసుకోకండి. మన అర్హతను పరిశీలించండి, దేవుని పిలుపు కై కనిపెట్టండి. 

1 కొరింథీయులకు 2: "12. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము."

పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పై వచనం చూడండి! దేవుని ఆత్మను పొందుకొని బోధించాము కానీ లౌకికాత్మ ద్వారా కాదు అని చెపుతున్నారు. లౌకికాత్మ అనగా లోక ప్రసిద్దమయిన వాటిని ప్రవచించటం. అంటువంటివి కాక దేవుని ఆత్మను పొందుకొని బోధించటం చెయ్యాలి. మనుష్యుల జ్ఞానము చొప్పున నేర్పయినా మాటలు కాకుండా, ఆత్మ సంభందమయిన సంగతులు ఆత్మ ద్వారానే బోధించాలి అలాగే ఆత్మతోనే సరిచూడాలి. బైబిల్ లో లేని పిట్ట కథలు, ఛలోక్తులు బోధించటం ఎంత మాత్రం సంఘము క్షేమమును జరిగించదు. తద్వారా విశ్వాసులకు ఆత్మీయ ఆహారం దొరకదు, వారు బలహినపడి నశించినచో తప్పు ఎవరిది?  అలోచించి ప్రార్థించండి! దేవుని పలుకులు తెలుసుకోండి! ప్రసంగం ఆ విధముగా చేయండి.  

దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తానుఅంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాకఆమెన్!!

6, మార్చి 2021, శనివారం

నువ్వు కోరుతున్న మేలు దేవుని చిత్తమేనా?

మన ప్రభువయిన యేసు క్రీస్తు చెప్పినట్లుగా "అడుగుడి మీకు ఇవ్వబడును, వేతకుడి మీకు దొరుకును మరియు తట్టుడి తియ్యబడును" అన్న వాక్యమును విశ్వాసించి, మనకు కావలిసిన మేలులను బట్టి ప్రార్థిస్తుంటాము. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవటం మరచిపోతాము! మనం కోరుకుంటున్న ఆ మేలు దేవుని చిత్తమేనా? ఆ మేలు కలుగుట వలన మనం ఆత్మీయంగా మరింతగా ఎదుగుతామా? లేదా దేవునికి  దూరంగా లేదా విరోధంగా మారిపోతామా? అన్న భవిష్యత్ ప్రణాళిక మీద దేవుడు మనకు ఆ మేలులు అనుగ్రహిస్తాడు. కొన్ని సార్లు ఆ మేలులు పొందుకోవటం ద్వారా తాత్కలికంగా  కలిగే మంచి కన్న  శాశ్వతంగా జరిగే చెడు ఎక్కువగా ఉంటె వాటిని పొందుకోక పోవవటమే మనకు మేలు. 

మనం కోరుకుంటున్న మేలులు దేవుని చిత్తమును నెరవేర్చేవిగా ఉండాలి! అనగా దేవుని పరిచర్యలో భాగంగా మిళితం కావాలి. ఉదాహరణకు సమూయేలు తల్లి హన్నా  ప్రార్థనను గమనించండి! 

1 సమూయేలు 1: "11.  సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. "

ఇక్కడ హన్నా పిల్లలు లేనిదిగా అవమానము పొందుతోంది. దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఏమని మొరపెడుతోంది! మగ బిడ్డను దయచేస్తే అతనిని దేవుని సేవకు వినియోగిస్తానని ప్రమాణం చేస్తోంది. తాను పొందుకొనే మేలును దేవుని పరిచర్యలో మిళితం చేస్తోంది. ఇక్కడ ఆమె స్వార్థం మచ్చుకయిన కనపడదు. కుమారుడు పుట్టిన తర్వాత మరల ఆమెకు పిల్లలు పుడుతారో లేదో కూడా తెలియదు కానీ దేవునికి ముందుగానే ప్రమాణం చేస్తోంది, కలిగిన ఒక్క బిడ్డను దేవుని సేవకు అంకితం చేస్తానని. ఆమె కోరుతున్న ఆశీర్వాదము దేవుని చిత్తములో ఉంది కనుక దేవుడు ఆమె కోరికను నెరవేర్చాడు. 

అన్ని సార్లు అలాగే ఉండాలని కాదు, కొన్నిసార్లు దేవుడు మన అవసరాల నిమిత్తం మనకు మేలులు దయచేస్తాడు.  కానీ కొన్ని మేలులు మనకు మేలు చెయ్యక పోగా కీడును చేస్తాయి. అంటువంటి సమయంలో దేవుడు ఆ మేలులు మనకు అనుగ్రహించకుండా ఆపివేస్తాడు. ఉదాహరణకు ఒక్క కుర్రాడు బైక్ గురించి తండ్రిని పీడిస్తున్నాడు అనుకుందాం. ఆ కుర్రాడి శక్తి సామర్థ్యాలు పూర్తిగా తండ్రి ఎరిగి ఉన్నాడు కనుక అతనికి బైక్ కొనివ్వటమో, ఇవ్వకపోవటమో చేస్తాడు. తండ్రి తనకు బైక్ కొనివ్వటం లేదు కనుక తండ్రికి తనంటే ఇష్టంలేదు అనుకోవటం ఆ కుర్రాడి తెలివి తక్కువతనం అవుతుంది. దేవుడు మన మేలులు ఆపివేయటం కూడా అటువంటిదే! 

బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాజయిన హిజ్కియా దేవుని చిత్తమును అంగీకరించక పోవటం వలన కలిగిన సంఘటనలు ఒక్కసారి  చూద్దాం.  

2 రాజులు 20: " ఆదినములలో హిజ్కియాకు మరణకరమైన.... రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా" 

పై వచనంలో దేవుడయినా యెహోవా రాజయిన హిజ్కియాకు ఆయువు తీరిందని సెలవిస్తున్నాడు. అప్పటివరకు ఆ రాజు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని దృష్టికి ఎన్నో మంచి పనులు చేసి ఉన్నాడు. కానీ మరణం వచ్చే సరికి దేవుని చిత్తమునకు విరుద్ధంగా ప్రార్థిస్తున్నాడు. 

2 రాజులు 20: "3. యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను."

పై వచనంలో హిజ్కియా ప్రార్థనను చూడవచ్చు. అప్పుడు దేవుడయినా యెహోవా తన యొక్క నిర్ణయమును మార్చుకున్నాడు. అప్పటి వరకు హిజ్కియాకు సంతానం లేదు. దేవుడు తనకు మరో పదిహేనేళ్ళు జీవితకాలం పొడిగించాడు (2 రాజులు 20: 5-6). దాని వలన జరిగిన అనర్థములు కూడా మనం తెలుసుకుందాం. అయుష్షూ పొడిగింపబడిన హిజ్కియా తనను పరామర్శించటానికి బబులోను నుండి వచ్చిన మనుష్యులను ఆహ్వానించి ఎంతో గర్వంగా తన యొద్ద ఉన్న సంపదను ప్రదర్శించాడు. తద్వారా భవిష్యత్తులో బబులోను వారు ఇశ్రాయేలు మీదికి దండెత్తి రావటానికి ప్రేరణ అయ్యాడు. అధేవిదంగా ఆ ఆయుష్షు ద్వారా మనష్షే అనే కుమారుణ్ణి కన్నాడు. అతను ఇశ్రాయేలు రాజులలో అత్యంత హీనుడని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. 

2 రాజులూ 21: "1. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా. 2.  అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రా యేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను."

పన్నెండు ఏండ్ల నుండి పాలించటం మొదలు పెట్టిన అతను దేవుని దృష్టికి ఎన్నో దుష్ట కార్యములు చేసి ప్రజలను దేవుని నుండి తిప్పివేశాడు. ఇదంతా ఎలా జరిగిందని  ఆలోచిస్తే, ఎం అర్థం అవుతుంది? హిజ్కియా రాజు దేవుని చిత్తమును అంగీకరించక తనకు ఇంకా ఎక్కువ అయుష్షూ కావాలని కోరుకున్నాడు. దేవుని చిత్తమునకు విరుద్ధముగా మరో పదిహేనేళ్ళు జీవితకాలము అనగా మేలులు పొంది ఈ కార్యములన్ని కలుగటానికి పరోక్షంగా కారణం అయ్యాడు. 

మనలను నడిపించవలసిన దేవుడు మరి మనకు కీడు చేయబోయే కోరికలను లేదా మేలులను ఎందుకు అనుగ్రహిస్తాడు అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఇదివరకు ఎన్నో మారులు మనం చెప్పుకోనట్లు దేవుడు మనకు పూర్తీ స్వేచ్ఛను కూడా అనుగ్రహించాడు. మన క్రియలకు మనమే భాద్యత వహించాలి. ఎలా అంటే! దేవుడు హిజ్కియాకు స్వస్థత అనుగ్రహించాడు మరియు కుమారుణ్ణి దయచేసాడు. కానీ అతను గర్వపడి సంపదను  ప్రదర్శించాడు మరియు కుమారునికి దేవుని మహిమను మరియు భక్తి శ్రద్ధలను నేర్పటంలో విఫలం అయ్యాడు. పన్నెండేళ్లకు రాజయిన అతను అంత హీనుడిగా మారటానికి కారణం ఎవరు? తండ్రిగా హిజ్కియా తన బాధ్యతను నెరవేర్చక పోవటమే అని అవగతమవుతుంది. మన ఉదాహరణలో చెప్పుకుంటే, తండ్రి కుర్రాడికి బైక్ కొనిచ్చాడు, కానీ వాడు దానిని తిన్నగా నడుపకుండా రకరకాల విన్యాసాలు చేసి ప్రమాదంలో పడితే తండ్రిని తప్పు పట్టటానికి లేదు. కనుక తండ్రి మాట విని బైక్ గురించి మంకుపట్టు పట్టకపోతే కొద్ది రోజులకు తండ్రి కారు కొని యిచ్చే  వాడేమో కదా! 

దేవుడు మన పట్టుదలను బట్టి, కోరికల తీవ్రతను బట్టి మనకు కావలసినది అనుగ్రహిస్తాడు, కానీ మనం ఆత్మీయంగా బలహీనులుగా మారిపోతాము. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు క్రింది వచనంలో చూడండి!

2 కొరింథీయులకు 12: "9.  అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె 10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను."

పౌలు అయనకు ఉన్న అనారోగ్యమును బట్టి దేవుణ్ణి స్వస్థతకై వేడుకుంటున్నాడు. కానీ దేవుని నుండి తనకు వచ్చిన సమాధానం "నా కృప నీకు చాలునని" కనుక తనకు ఉన్న ఆ బలహీనతలోనూ అతను బలవంతుడనని సంతోషిస్తున్నాడు. బలహీనతలో బలం ఎలా కలిగింది! దేవుడు తనకు తోడై ఉన్నాడు, అతను పూర్తిగా దేవుని చిత్తములో నడుస్తున్నాడు. దేవుని నిర్ణయమును అంగీకరించాడు. తానూ కోరుకొనే మేలు అనగా స్వస్థత  కన్నా దేవుని కృపలో మిక్కిలి సంతోషించాడు. 

కానీ ఇశ్రాయేలు వారు హిజ్కియా వలెనె తమ కోరికలు అణుచుకోలేక బలహీనులుగా మారిపోయారు. దేవుని చిత్తమును కనిపెట్టక తమకు కావలసిన మేలులకై ఆరాటపడి దేవునికి ఆగ్రహం తెప్పించారు. 

కీర్తనలు 106: "13.  అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. 14.  అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి 15.  వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను."

పై వచనం చూడండి! దేవుడు మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషిస్తుంటే వారు దానితో తృప్తి పడక, రుచులు మరిగి మాంసం కోసం అల్లాడినారు. అందు నిమిత్తమై తమ నాయకుడయినా మోషేతో వాదించి దేవుణ్ణి చులకనగా మాట్లాడారు. దేవుడు వారు కోరుకున్న మాంసం ఇచ్చాడు కానీ వారి ప్రాణములకు బలహీనత కలుగజేసాడు. పౌలు బలిహీనతలో కూడా బలంగా ఉన్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు వారు బలంలో కూడా బల హీనులుగా మారిపోయారు. వారు కోరుకున్న మేలు పనికి రానిది, దేవుని చిత్తములో లేనిది. కనుక వారు బలహీనులుగా మారిపోయారు. 

కనుక సహోదరి, సహోదరుడా నువ్వు కోరుకొనే మేలు దేవుని పరిచర్యలో మిళితమయి ఉందా? అది దేవుని చిత్తములో ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. గ్రామంలో ఉన్న ఒక్క దైవ సేవకుడు, అంతర్జాతీయంగా సేవ చేయాలనీ కోరుకోవటం తప్పుగా అనిపించక పోవచ్చు కానీ దానికి తగ్గ నైపుణ్యం తనకు ఉందా? దేవుని సేవను అంతటి స్థాయిలో జరిగించగలడా? అలాగే భవిష్యత్తులో గర్వపకుండా దేవుని సేవను నిస్వార్థంగా నడుపగలడా? అని తనను తాను అంచనా వేసుకోవాలి. దేవునికి మనలను దూరం చేసే గుర్తింపు లేదా మేలుల కన్నా గుర్తింపు లేని సాధారణ జీవితమే మనకు మేలు కదా! దేవుని మీద ఆధారపడి మేలులు కోరుకోవాలి. అప్పుడు  ప్రభువే మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. తగు సమయంలో ఆ మేలులు మనకు దయచేస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తానుఅంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాకఆమెన్!!

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

దేవుని గద్దింపును అంగీకరిస్తున్నావా?

దేవుడు మొదటి మానవులయిన ఆదాము, హవ్వలను తన స్వరూపములో చేసి, వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పటికి సంపూర్ణ  స్వేచ్ఛను వారికి ఇచ్చాడు. అనగా వారి ఆలోచనలు వారికి ఉన్నాయి, తమ ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు.  ఏదెను వనములో దేవుడు జ్ఞానము ఇచ్చే చెట్టు ఫలమును తినవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వారు సాతాను మాటలు నమ్మి, దేవుని మాటలు పెడ  చెవిన పెట్టి ఆ పండును తిన్నారు. ఇదంత వారికి  సంపూర్ణ స్వేచ్ఛ ఉండటం వలన జరిగింది. దేవుడు ఎందుకు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. మనం ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించటానికే! అదెలా! అంటారా? ఉదాహరణకు ఒక్క సైంటిస్ట్ కు ఒక  కొడుకు ఉన్నాడు, వాడికి ఎన్ని సార్లు చెప్పిన అల్లరి పనులు మానటం లేదు. బుద్ది చెప్పిన ప్రతిసారి తండ్రి మీద కోపం పెంచుకొని అతన్ని ద్వేషించటం మొదలు పెట్టాడు.  వాడికి మాదిరి కరంగా  ఉండాలని ఒక రోబో బొమ్మను తయారు చేశాడు అ సైంటిస్ట్. ఈ రోబో బొమ్మను అతను ఎలా తయారు చేసాడంటే, ఎప్పుడు కూడా అల్లరి చేయకుండా, చెప్పిన మాట వింటూ, ఐ లవ్ యు డాడీ  అని చెప్పటమే దాని పని. దాన్ని చూసి కూడా వాడిలో ఏ  మార్పు లేదు. అయితే  ఒక్క రోజు తనకు వచ్చిన సమస్యను బట్టి తండ్రి దగ్గరికి  వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నడు, తండ్రి వాడిని ప్రేమతో దగ్గర తీసుకోని ఓదార్చి, వాడి సమస్యను తీర్చాడు. తండ్రి ప్రేమను గుర్తించిన అ పిల్లాడు ఒక్కసారిగా కరిగిపోయి ఐ లవ్ యు డాడి అని తన తండ్రిని హత్తుకున్నాడు.  తండ్రి మనసు సంతోషంతో ఉప్పొంగి పోయింది! ఎందుకు? 

రోబో కూడా  రోజు ఐ లవ్ యు డాడి అని చెపుతుంది కదా! చెప్పిన మాట వింటుంది కూడా. కానీ దానికి స్వేచ్ఛ లేదు, సొంత ఆలోచన లేదు, ఎప్పుడు ఐ లవ్ యు చెప్పవలసిందే. కొడుకుకు మాత్రం సంపూర్ణ స్వేచ్ఛ ఉంది, సొంత ఆలోచనలున్నాయి. ఆ పిల్లాడు తండ్రి మాటను వినకుండా ఉండవచ్చు మరియు అతనికి ఐ లవ్ యు చెప్పకుండా కూడా ఉండవచ్చు. తన స్వేచ్ఛను వదులుకుని తండ్రి మాటను వినటం మొదలు పెట్టాడు, అల్లరి పనులు మానేసాడు. దేవుడు కూడా మన నుండి  అటువంటి ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాలని మనకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఇక్కడ పిల్లాడు తన స్వేచ్ఛను వదులుకుంటున్నాడు కదా! మరి పిల్లాడి స్వేచ్ఛను హరించటం తండ్రికి ఇష్టమా? కానే కాదు! తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. తెలియక వారు చేసే తప్పులు వారి పురోగతిని అడ్డుకోకుండా వారి అల్లరికి అడ్డుకట్టలు వేస్తాడు. మన ఆత్మీయ జీవితం బాగుండాలని మన పరలోకపు తండ్రి కూడా మన పాపమునకు అడ్డుకట్టలు వేస్తాడు. 

ఏ మంచి లేని ఈ శరీరంలో ఉండి అయన ఆజ్ఞలు పాటిస్తూ పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నాడు.  ప్రభువయినా యేసు క్రీస్తును నమ్ముకొన్న క్షణం నుండి, తన పరిశుద్దాత్మ నడిపింపును మనకు ఇస్తూ, తన ప్రేమ చొప్పున గద్దిస్తూ, ఆదరిస్తూ తనకు దగ్గరగా ఉండాలని నిత్యం మనలను ప్రేరేపిస్తున్నాడు. కానీ స్వేచ్ఛతో ఉన్న మనము ఆ గద్దింపును అంగీకరించకుండా, పాపం లో పడిపోతూ  మరింతగా దేవునికి దూరం అవుతున్నాము. దేవుడు మనలను  ఎలా గద్దిస్తాడు? దావీదు మహారాజుకు దేవుడు అతని కుమారుడయినా సొలొమోనును బట్టి వాగ్దనము చేస్తున్న మాటలు వినండి!

2 సమూయేలు 7:"14. నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని 15.  నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను."

పై వచనం స్పష్టం చేస్తున్న విషయం ఏమిటి? మనం పాపం  చేసినప్పుడు దేవుడు మనలను మనుష్యులకు అప్పగిస్తాడు, లేదా సమస్యలను మన మీదికి అనుమతిస్తాడు. విశ్వాసులుగా ఉన్న మనకు కష్టాలు ఉండవు అని చెప్పటం లేదు! మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని బలపరిచే పరీక్షల్లాంటి సమస్యలు కొన్నయితే, తప్పిపోయినప్పుడు లేదా పాపంలో పడిపోయినప్పుడు వచ్చే సమస్యలు కొన్ని. విశ్వాసాన్ని బలపరిచే సమస్యలు లేదా శోధనలు మనం తట్టుకోలేనంతగా ఇవ్వడు దేవుడు, మరియు అయన కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటుంది. కానీ పాపంలో  పడిపోయినప్పుడు లేదా మనలను క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు వచ్చే సమస్యలు లేదా శోధనలు తీవ్రంగా ఉంటాయి. మన నడక మారనంత వరకు దేవుడు మనలను నలుగ గొడుతూనే ఉంటాడు. దానిని గుర్తించి ఆయనకు మొరపెట్టిన నాడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. 

ద్వితీయోపదేశకాండము 8: "5.  ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని 6.  ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను."

తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లుగా అయన మనలను దండిస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను సామ్రాజ్యమునకు  అప్పగించే ముందు యిర్మీయా ప్రవక్త ద్వారా ఎన్నో మారులు వారిని, మరియు ఇశ్రాయేలు రాజులను హెచ్చరించాడు. కానీ శరీర క్రియలకు, విగ్రహారాధనకు అలవాటుపడిన వారు ఆ ప్రవక్తను బంధించి హింసించారు. అబద్ద ప్రవక్తల మాటలు నమ్మి దేవుని మాటలు పెడ చెవిన పెట్టారు. కనుకనే వారందరు బబులోనుకు బానిసలుగా కొనిపోబడ్డారు, వివిధ దేశాలకు చెదరిపోయారు. కానీ అంటువంటి సమయంలో కూడా దానియేలు వంటి గొప్ప విశ్వాసులు దేవునితో నడచి, ఘనతను పొందారు. 

యోబు 5: "17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. 18.  ఆయన గాయపరచి గాయమును కట్టునుఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును. "

దేవుడు ఈ విధముగా అందర్నీ గద్దించడు. తన చిత్తములో ఉన్నవారిని మాత్రమే అనగా ఆయనను అంగీకరించినా వారిని మాత్రమే తన వారిగా చేసుకొని వారిని తన మార్గములో నడిపించటానికి శిక్షిస్తాడు, తద్వారా శిక్షణ ఇస్తాడు. దానిని అంగీకరించి మనలను మనం సరిచేసుకున్న నాడు ఆయనే మనకు సమాధానం ఇస్తాడు. అనగా మన గాయములకు కట్టుకడుతాడు. ఆ శిక్ష సమయములో మనం అయనతో సాగిపోవాలి, క్షమాపణ వేడుకోవాలి కానీ మనసును కఠినం చేసుకొని ఆయనకు మరింతగా దూరం కారాదు. 

హెబ్రీయులకు 3: "13.  నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, 14.  పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లునేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.

పౌలు గారు హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో ఏమంటున్నాడు చూడండి! దేవుని శబ్దమును విని అనగా గద్దింపును విని హృదయములను కఠినపరచుకొని ఆయనకు ఆగ్రహం తెప్పించిన వారివలె, అనగా అరణ్యంలో ఇశ్రాయేలు వారివలె,  ఉండరాదు. మరియు పాపము వలన కలుగు భ్రమచేత ఎవరు కూడా కఠినపడి, పాపమూ పట్ల సున్నితత్వమును కోల్పోయి దేవుడు ఇచ్చే నిత్య  విశ్రాంతిని కోల్పోకుండా ఒక్కరి నొకరు బుద్ది చెప్పుకోమంటున్నాడు. పరిశుద్దాత్మ దేవుడు మనకు ఇచ్చే నడిపింపును గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకొందాము. దేవునికి మనం ఎంత దగ్గర అవుతుంటే అంతగా సాతాను తన శక్తియుక్తులతో మనలను పడదోయాలని చూస్తాడు. ఆదాము, హవ్వల వలే వాని మాటలకూ అనగా శోధనలకు లొంగక దేవుని నడిపింపును అంగికరించాలి. 

మత్తయి 16: "15.  అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను. 16.  అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. 17.  అందుకు యేసు సీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. 18.  మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

మత్తయి సువార్తలో పేతురు యేసయ్యను దేవుని కుమారుడవని చెప్పిన వెంటనే, యేసయ్య పేతురుతో దీనిని పరమునందున్న తండ్రే నీకు బయలుపరచాడు అని చెప్పి అతని  విశ్వాసము వంటి బండ మీద తన సంఘమును కడుతానని అన్నాడు. అది జరిగిన కొద్దీ సమయానికి  యేసయ్య తన సిలువ మరణం గురించి, పునరుద్ధానము గురించి చెప్పగానే సాతాను పేతురును ప్రేరేపించి యేసయ్యను శోధించటం మొదలు పెట్టాడు. ఎందుకిలా? పేతురు దేవునికి చాల దగ్గరగా ఉన్నాడు! మరియు యేసయ్య ప్రణాళికలో ఉన్నాడు. అంతే కాకుండా యేసయ్య సిలువ మరణము తన పాపపు లోకమును జయిస్తుందని, మనుష్యులను పాపం నుండి రక్షిస్తుందని తెలిసి  పేతురు ద్వారా యేసయ్యను ఆపాలని చూస్తున్నాడు. 

మత్తయి 16: "23 అయితే ఆయన పేతురు వైపు తిరిగిసాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంప"

వెంటనే యేసయ్య పేతురును "సాతానా వెనుకకు పో! నీవు నాకు అభ్యంతర కారణమయినావు. నీవు మనుష్యుల సంగతులను తప్ప దేవుని సంగతులు తలంచటం లేదు" అన్నాడు. ఇక్కడ పేతురును యేసయ్య సాతానా అని అందరి ముందు గద్దించినప్పుడు ఎంతో  అవమానంగా భావించవచ్చు. మరియు తన మనసు కష్టపెట్టుకొని, కఠిన పరచుకొని  యేసయ్యను వదిలి పోవచ్చు. కానీ పేతురు యేసయ్య చెప్పిన బోధను అర్థం చేసుకొని, అయన గద్దింపును అంగీకరించాడు, కనుకనే విశ్వాసములో కొనసాగాడు. 

మత్తయి 16: "24.  అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. 25.  తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును

యేసయ్య చెప్పిన పై మాటలు పేతురును, మరియు ఇతర శిష్యులను కూడా బలపరచాయి. దేవుని కూమారుడయిన తానూ మనిషిగా సిలువ మీద పొందవలసిన మరణమును తెలియజేశాడు. అంతే కాకుండా తనను వెంబడించాలకున్న వారు తమను తాము ఉపేక్షించు కోవాలని వారికి బోధించాడు. అనగా తమ స్వేచ్ఛను వదులుకొని దేవుని కార్యములు జరిగించటము మరియు వాక్యానుసారముగా శరీర క్రియలు మాని పవిత్రముగా జీవించటము. యేసు క్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం చేసింది అదే కదా! 

చివరగా దావీదు రాసిన కీర్తన లోంచి క్రింది వచనం చూడండి!

కీర్తనలు 95: "7.  రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. 8.  అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి." 

మనలను సృష్టించిన దేవుని మాట అంగీకరించిన యెడల ఎంత మేలు! ఇశ్రాయేలీయుల వలె హృదయమును కఠినపరచుకొనక అయన మాటలకు తల ఒగ్గటం మనలను విశ్వాసములో బలపరుస్తుంది మరియు ఆయనకు దగ్గరగా మనలను ఉంచుతుంది. కనుక సహోదరి సహోదరుడా, దేవుని గద్దింపును గుర్తించండి, అంగికరించండి. మనలను మనం ఉపేక్షించుకుందాం, దేవుని ప్రణాళికలో కొనసాగుతూ ఆత్మీయంగా పురోగతి సాధిద్దాం.  దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!