23, అక్టోబర్ 2020, శుక్రవారం

ఆత్మీయతలో అసూయ ఉందా?


దేవుడు మనుష్యలయిన మనందరిని తన సన్నిధిలో ఉండటానికి ఏర్పరచుకున్నాడు. తన ప్రియ కుమారుడు, మన రక్షకుడయినా యేసు క్రీస్తు పట్ల మన విశ్వాసము పెంపొందించటం ద్వారా అయన నీతిని మనకు ఆపాదించి పవిత్రులుగా చేసాడు. తద్వారా మనకు రక్షణ అనుభవం ఇచ్చాడు. అనగా మన పాపముల నుండి విమోచన కలిగించి, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, తన ఆజ్ఞలు మీరకుండా, తన వాక్యము అర్థం చేసుకొని జీవించటానికి కావలసిన తెలివిని, జ్ఞానమును దయచేస్తూ,  మన రక్షకుడయినా యేసు క్రీస్తుల వారి స్వరూపములోకి మారటానికి ఆత్మీయ ఎదుగుదలను  అనుగ్రహిస్తూ ఉంటాడు.  ఈ ఆత్మీయ ఎదుగుదల మన రక్షణ అనుభవమును బట్టి కాక మన యొక్క  బైబిల్ జ్ఞానమును బట్టి, ప్రార్థన తడబడకుండా చేసే విధానమును బట్టి, లేదా వారికి తెలిసిన క్రైస్తవ గీతాల  సంఖ్యను బట్టి మెండుగా ఉన్నట్లు సంఘాలలో భావిస్తారు, కానీ అది దేవుని కొలమానములో లేదు. 

కొత్తగా విశ్వాసములోనికి వచ్చిన సహోదరి, సహోదరులు ప్రతి విషయములో ప్రతిభ లేని వారిగా కనబడవచ్చు. వారి విశ్వాసం, మరీ అంత గొప్పగా లేకపోవచ్చు, అనర్గళంగా ప్రార్థన చేసే తత్వం వారిలో కానరాక పోవచ్చు, బైబిల్ లో వాక్యము తీయటానికి కష్టపడవచ్చు, కానీ దేవుడి దృష్టిలో వారు ఆత్మీయ జీవితంలో ఇంకను పాలు త్రాగే శిశువుల వలె ఉన్నారు. ఎందుకంటే వారికి ఇవ్వబడిన జ్ఞానము,  క్రీస్తు దేహమయిన,   సంఘములో అనుభవము బహు తక్కువ.  అంటువంటి శిశువులతో, నడక నేర్చిన, పరుగు పెట్టే సాటి విశ్వాసులు  పోల్చుకుంటూ "తాము వారికంటే గొప్ప" అనే ఆత్మీయ గర్వమునకు లోను కావటం దేవుని దృష్టిలో అంగీకారం కానేరదు.  అదేవిధముగా వారి తడబాటును చూసి ఎగతాళి చేయటం, దేవుని దృష్టిలో నేరమే. దేవునికి అసహ్యమయిన విషయం గర్వము.  దూరం ఎంతటిదయిన ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, విశ్వాసి ఎంత నీతి పరుడయినా పాపిగానె ప్రారంభమవుతాడు.  మన గొప్ప కోసం, మొగ్గ స్థాయిలో ఉన్న విశ్వాసులను చులకనగా చూడటం, సంఘంలో  వారికి ఏవయినా బాధ్యతలు అప్పగిస్తే తట్టుకోలేక పోవటం ప్రభువు దేహములో భాగమయిన మనకు తగునా? బలహీనుడయినా సహోదరుని విశ్వాసమును దెబ్బ తీసే లాగున ప్రవర్తించు ప్రతి వాడును పాపము చేసినవాడేనని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని ఏమిదవ అధ్యాయం నుండి  క్రింది వచనం చూడండి. 

1 కొరింథీయులకు 8: "12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు." 

పై వాక్యము స్పష్టముగా చెబుతున్న సంగతులు గ్రహించి, సాటి విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడిన వారిగా ఉండటం సంఘమునకు క్షేమకరం. దేవుడు తన సేవ కొరకు అల్పులు, అజ్ఞానులను ఎన్నుకొంటాడు. అయన దృష్టికి గర్వం కలవారు అసహ్యులు, పనికి రాని వారు. ప్రభువు ఇచ్చే ఫలము ప్రతి వారికి ఒకేలాగా ఉంటుంది. ప్రభువు  ఎవరు  ఎప్పుడు మొదలు పెట్టారొ  చూడటం లేదు  కాని  విశ్వాసములో కొనసాగటమే చూస్తాడు. కనుక క్రొత్త విశ్వాసులను తేలికగా చూడటం లేదా వారికి ఇవ్వబడుతున్న తలాంతులను బట్టి, సంఘములో వారికి ఇవ్వబడుతున్న బాధ్యతలను బట్టి అసూయపడటం కడు దీనుడయినా యేసు క్రీస్తు విశ్వాసులుగా మనకు తగదు. 

ఈ విషయాలను బట్టి దేవుని వాక్యములో యేసు క్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్తలో గొప్ప సంగతులను  మనకు నేర్పించారు. 

మత్తయి 20: "8. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. 9. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. 10. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. 11. ​వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, 12. పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి. 13.  అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయ లేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; 14.  నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; 15.  నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా3 అని చెప్పెను. 

ప్రభువు చెప్పిన ఈ ఉపమానమును గమనిస్తే సాటి సహోదరుల పట్ల, మరీ ముఖ్యంగా క్రొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల మన ధోరణి ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు. ప్రభువు చెప్పిన ఈ ఉపమానంలో ఒక తోట యజమాని కొందరు కూలీలను పనికి కుదుర్చుకున్నాడు, కొన్ని గంటలు అయిన తర్వాత మరికొంత మంది పనిలోకి వచ్చారు. ఆపైన ఒక గంటలో పని గంటలు ముగుస్తాయనగా ఇంకొంతమంది పనివారు వచ్చి పనికి కుదిరారు. పని ఘడియలు ముగియగానే ఆ యజమాని తన గుమస్తాకు పనివారందరికి  డబ్బులు ఇమ్మని చెప్పాడు. అప్పుడు ఒక గంట పని చేసిన వారికి, మరియు కొన్ని గంటలు పని చేసిన వారికి ఒక దినారము ఇవ్వటం చూసిన, రోజంతా పని చేసిన పనివారు తమకు ఇంకా ఎక్కువ లభిస్తుందని ఆశించారు. కానీ ఆ యజమాని వారికి కూడా మిగతా వారి లాగే ఒక్క దినారము ఇవ్వటం చుసిన ఆ పనివారు గొణుక్కుంటూ "ఒక గంట పనిచేసిన వారిని, రోజంతా కష్టపడిన మమల్ని సమానంగా చుస్తున్నావు" అని గొణుక్కున్నారు. ముందుగా వచ్చిన విశ్వాసి, నీ తర్వాత వచ్చిన విశ్వాసుల పట్ల నీ ఉద్దేశ్యం అలాగే ఉందా? అయితే ప్రభువు నీతో అనే మాటను, యేసయ్య ఆ  యజమాని ద్వారా చెపుతున్నాడు. "నీకు ఇస్తానన్న కూలి ఇచ్చేసాను, నేను మిగతా వారికి ఎంత ఇస్తే నీకెందుకు, నేను మంచితనంతో ఉంటె నీ కడుపు మండిందా" అని. దేవుడు ప్రేమ స్వరూపి, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి విశ్వాసికి తన కృపలను అనుగ్రహిస్తాడు, తన సంఘములో స్థానం కల్పించి ఆత్మీయంగా బలపరుస్తాడు.  వారి విశ్వాసము చొప్పున, వారికి ఉన్న భారమును బట్టి తలాంతులు అనుగ్రహించి, తన పరిచర్యలో వాడుకుంటాడు. 

మన  విశ్వాస పరుగును అందరి కన్న ముందు మొదలు పెట్టాము  కదా! అని మన తర్వాత వచ్చిన వారిని దేవుడు తక్కువ చెయ్యాలను కోవటం వాక్యానుసారం కాదు. లోతుగా ఆలోచిస్తే, అటువంటి ఆలోచన విధానం, మన  యొక్క అసూయను, మనకు లోకము పై ఆశను సూచిస్తుంది. "అయ్యో ! అనవసరంగా ముందే విశ్వాసంలోకి వచ్చాము! వీరి లాగే అన్ని అనుభవించి వస్తే బాగుండేది! అంతే దొరికే మేలులకు, ఇంత కాలం అన్ని సుఖాలు వదులుకున్నాను" అనుకున్నట్లు లేదా? ఇక్కడ ముందుగా వచ్చిన వారికి జరిగిన లాభం ఏమిటి? నిశ్చయత! ప్రశాంతత! ఆనందం! నమ్మకము! ఇతరుల వలె వారు పని గురించి ప్రయాస పడవలసిన అవసరం రాలేదు. తమకు ఈ రోజు కూలి దొరుకుతుంది కాబట్టి, తగిన ఆహారం తింటాము అన్న నిశ్చయత, దానితో ప్రశాంతత, అందువలన ఆనందం దాంతో పాటు రేపు కూడా పని దొరుకుతుందని నమ్మకము. అంటువంటి ప్రశాంతత ఎన్ని డబ్బులు ఇచ్చి కొనగలం? చివరి వారు ఎంత బాధ అనుభవించి ఉంటారు? కూలి దొరుకుతుందో లేదోనని ఎంత యాతన పడి ఉంటారు?  అటువంటి యాతన మనకు  తప్పినందుకు సంతోషంగా లేదా? దేవుని ప్రేమకు మనం హద్దులు నిర్ణయిస్తున్నామా? 

సాటి వారిని దేవుడు దీవిస్తున్నందుకు దేవునికి  కృతజ్ఞతలు చెల్లించాలి! మన అవసరమును, మన ఆశలను తన చిత్తానుసారముగా తీర్చేది కూడా ఆ దేవుడే అని గుర్తుంచుకొని మన విశ్వాసం కొనసాగించాలి. దేవునికి ఇష్టమయిన వారిగా మన విశ్వాసం కొసాగిస్తున్నందుకు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందుకంటే మనం చెడ్డవారిగా ఉన్నప్పుడే మనలను ప్రేమించి అయన పట్ల మనకు విశ్వాసం అనుగ్రహించాడు కాబట్టి ఆనందించాలి. అంతే కాకుండా మన విశ్వాసము ఇతరులకు ఇబ్బంది కారాదు, వారి ఆశీర్వాదాలు మనకు అసూయా కారణం కారాదు. ఆత్మీయతలో దీనత్వం కనబడాలి, విశ్వాసంలో సహనం ఉండాలి. అటువంటి పరిశుద్దాత్మ నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక.  దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

18, అక్టోబర్ 2020, ఆదివారం

లోకముతో సంబంధం ఉందా?


ప్రభువయిన యేసు క్రీస్తును మన రక్షకునిగా చేసుకున్న తర్వాత, మారు మనసు పొందిన వారమయి, ఇది వరకు మనం చేసిన పాపపు కార్యములను చేయకుండా ఉండవలెనని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది.  మన శరీరములో నిత్యమూ లోక సంబంధమయిన, నీతి యుక్తము కానీ క్రియలు తారసిల్లుతుంటాయి. దేవుడు అతి పరిశుద్ధుడు,  మనం ఆయనలో నిలవాలి అంటే, మనం కూడా పవిత్రంగా ఉండవలసిందే.  అప్పుడే మనం విశ్వాసం లో కొసాగుతున్నట్లు. బాప్తిస్మము పొందగానే, ప్రతి ఆదివారం దేవుని మందిరమునకు  వెళ్తుంటే తాము పవిత్రులుగా మారిపోయినట్లు భావిస్తారు చాల మంది. అటువంటి స్థితిలో మనం ఉంటె పశ్చాత్తాపమును మరచిపోయి, మనకు లోకముతో ఉన్న సంబంధమును గుర్తించని వారిగా ఉన్నాము. 

1 పేతురు 4: "2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును. 3.  మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును, 4.  అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు." 

అపొస్తలుడయిన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, యేసుక్రీస్తు విశ్వాసులము అయినా మనము ఇదివరకు చేసిన శరీర క్రియలు చెయ్యవలదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకు ముందు అన్యజనులు చేయు కార్యములు, అనగా లోక రీతులు  పాటించినది చాలునని, ఆ కార్యములన్నింటిని వివరిస్తున్నారు.  అంతే కాకుండా లోకస్తులు తమ కార్యములలో, మనం పాల్గొననందుకు దూషించగలరు అని చెబుతున్నారు. అంటువంటి వారి స్నేహముకై, వారి మెప్పు కొరకై దేవునికి ఇష్టం లేని ఇటువంటి క్రియలు, దేవుని వారాలుగా పిలువబడుతున్న మనం చేయతగదు. 

ఇటువంటి స్థితిలో మనం కొనసాగటానికి కారణం, మన స్థితిని మనం గుర్తించకపోవటమే. అనగా మనం చేస్తున్న లోక పరమయిన కార్యములను మనం చాల తేలికగా తీసుకోవటం వల్లనే. ఆదివారం చర్చ్ కు వెళ్ళి ఆరాధించి, ప్రభువు బల్లలో పాలుపంచుకుంటే సరిపోతుంది అనుకోవటమో లేదా రోజుకు ఒక గంట టీవీ లో వచ్చే ఎదో ప్రసంగం వింటేనో సరిపోతుంది అనుకోవటమే వీటికి కారణం.  కానీ అన్నింటికన్నా ముఖ్యమయినది, పాపముల ఒప్పుకోలు, మరియు (Self Cleansing) ఆత్మశుద్ధి కలిగి ఉండటం. పాపములు ఒప్పోకోనే వారే తమ స్థితిని గుర్తించిన వారిగా ఉంటారు. అటువంటి వారే లోక రీతులకు దూరంగా ఉంటూ, తమ ఆత్మీయ జీవితంలో బలంగా ఎదుగుతారు. 

బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తుల వారు, మనకు ఎన్నో పాఠాలు నేర్పించారు. తన గొప్ప కోసం కాకుండా, తండ్రి నామమునకు ఘనతను తేవటముతో పాటు మనకు అమూల్యమయిన  సంగతులు బోధించారు. మార్కు సువార్తలో 8 వ అధ్యాయం 22 వ వచనం నుండి 26 వ వచనము వరకు చదివితే ఆ సంఘటనను చూడవచ్చు. 

మార్కు 8: "22.  అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడు కొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. 23.  ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమి్మవేసి, వాని మీద చేతులుంచినీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, 24.  వాడు కన్నులెత్తిమనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. 25.  అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. 26.  అప్పుడు యేసునీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను." 

పై వచనములలో యేసు క్రీస్తుల వారు బేత్సయిదా నుండి వచ్చిన ఒక గ్రుడ్డి మనుష్యుడిని స్వస్థపరిచారు. యేసు ప్రభువుల వారు స్వస్థతలు చేసే ముందు "నీకు విశ్వాసం ఉందా" అని అడిగి "నీ విశ్వాసము ప్రకారమే అవునుగాక" అని వారిని వెంటనే  స్వస్థ పరుస్తారు.  కానీ ఇక్కడ ప్రభువుల వారు ఆ వ్యక్తిని ఉరి బయటకు తీసుకొచ్చిన  తర్వాత స్వస్థ పరిచారు. ఆశ్చర్యంగా ఎప్పుడు లేని విధంగా  ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని  రెండు సార్లు ముడితే గాని స్వస్థత రాలేదు. దానికి కారణం ఏమిటి? గ్రుడ్డి వ్యక్తికి విశ్వాసం లేదా? అతను ప్రభువు స్వస్థ పరచిన కూడా ఎందుకు స్వస్థత పొందలేదని నిజం చెప్పాడు?   యేసు క్రీస్తు ప్రభువుల వారు అతన్ని స్వస్థ పరచిన తర్వాత ఎందుకు బేత్సయిదా ఊరిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు?  ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మనకు లోకముతో సంభంధం ఉండటం వల్ల జరిగే నష్టములు, మరియు దానిలో నుండి బయటకు  వస్తే జరిగే మేలులు అవగతం అవుతాయి. 

బేత్సయిదా ఉరిని బట్టి యేసు క్రీస్తుల వారు మత్తయి సువార్తలో హెచ్చరికలతో గద్దించారు. ఆ విషయాలను మనం చూసినట్లయితే ఈ ఉరి నుండి ప్రభువుల వారు అతన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారొ అర్థం అవుతుంది. 

మత్తయి 11: "20.  పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. 21.  అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారు 22.  విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను." 

కోరాజీనా, బేత్సయిదా  పట్టణముల వారు ప్రభువు చేసిన అద్భుత కార్యములు చుసిన కూడా మారు మనసు పొందని వారుగా ఉన్నారు. అనగా వారు లోక కార్యములు చేయుచు పశ్చాత్తాపము పొందక, దేవునికి ఇష్టంలేని పాపపు జీవితమునే  కొనసాగిస్తున్నారు. కనుకనే ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని ముందుగా ఉరి నుండి వేరు చేశారు. మనలో కూడా ఆత్మీయపరంగా  అంధకారము తొలగి పోవాలంటే ముందుగా లోకమునకు వేరు కావాలి. 

ఆ తరువాత ప్రభువు అతన్ని ముట్టి "కనబడుతున్నదా" అని అడిగినప్పుడు ఆ గ్రుడ్డి వ్యక్తి చాల నిజాయితీగా పూర్తి స్పష్టత లేనట్లుగా, మనుష్యులకు, చెట్లకు తేడా తెలియటం లేదని చెప్పాడు.  అతను ఇక్కడ ఎంతో మందిని బాగు చేసిన యేసు క్రీస్తు  నన్ను స్వస్తపరుస్తున్నాడు గనుక "కనబడుతుంది ప్రభువా" అని చెప్పలేదు. అంతే కాకుండా వచ్చిన చూపు చాలులే అనుకోలేదు. నా ప్రియా సహోదరుడా, సహోదరి మనకు అలాంటి నిజాయితీ ఉందా? ఇంకా నాకు స్పష్టమయిన చూపు కావాలి, ఇంకా నేను ఆత్మీయతలో ఎదగాలి అన్న సంకల్పం ఉందా? నేను నమ్ముకున్నది పరిశుద్ధుడయినా యేసు క్రీస్తును గనుక నాకు ఎంటువంటి పాపమూ అంటదని నీ ఆత్మశుద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నావా?  యేసయ్య రక్తం పవిత్రమయినది,  శక్తివంతమయినదే, కానీ ఆయన సంబంధులమయిన మనం కూడా అంతే పవిత్రంగా ఉండాలి, పరిశుద్దాత్మ శక్తితో నిండి ఉండాలి. 

ఆ బేత్సయిదా ఉరి నుండి బయటకు రావాలి, ఆ మారు మనసు పొందని, పశ్చాత్తాప పడని స్థితి నుండి బయటకు రావాలి.  మన ఆత్మీయ పరుగుకు అడ్డుపడే గ్రుడ్డి తనం నుండి స్వస్థత కావాలి, గొప్ప వెలుగుతో నిండిన చూపుతో యేసయ్య కోసం మన పరుగు కొనసాగాలి. ఒక వేళ పూర్తీ స్వస్థత పొందిన తర్వాత మరల ఆ బేత్సయిదా ఉరికి వెళుతున్నావా? యేసయ్య ఆ గ్రుడ్డి మనిషికి చెప్పినట్లు నువ్వు కూడా  మరల ఆ ఊరిలోకి, ఈ లోకంలోకి వెళ్ళవద్దు. తిరిగి గ్రుడ్డి తనం నిన్ను ఆవరిస్తుంది. మరల దేవుడు నిన్ను స్వస్థపరచాలి. ఇలా వెనుకకు ముందుకు వెళ్తుంటే దేవుడు నిన్ను చూసి సంతోషించేది ఎప్పుడు? అయన నీకు ఇచ్చిన రక్షణకు నువ్విచ్చే ప్రాధాన్యత ఏపాటిది? ఆ పవిత్ర రక్తానికి నువ్వు ఇచ్చే విలువ ఏమిటి? సమయం మించి పోలేదు! మరోసారి ప్రభువును వేడుకో, నిజాయితీగా ఒప్పుకో! దేవా నాకు నీ వెలుగును చూసే స్పష్టత  కావాలని, నాలో పాపం ఇంకా ఉందని పశ్చాత్తాప పడు. ఆ ఊరిలోకి, ఈ లోకం లోకి  వెళ్ళే బలహీనత  లేకుండా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. 

ప్రసంగి 7: "5. బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు. 6.  ​ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము." 

ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయినా సొలొమోను రాజు రాసిన పై వాక్యాలు చూడండి. లోకములో  ఉండే సినిమాలు, నాటకాలు, కామెడీ షోలు, తాగుడు, వ్యభిచారము ఇంకా ఆటపాటలు అన్ని కూడా గడ్డి మంట లాగా ఉవ్వెత్తున్న ఎగిసి చల్లారిపోతాయి. దాని వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. ఆ తుచ్చమైన విషయాలు, మనలను శోదించటమే కాకుండా, మన అడుగులు పాపం వైపు వేయటానికి ప్రేరణ కల్పిస్తాయి.  మనలను శోదించేది ఏదయినా సాతానుతో  సంబంధం కలిగి ఉన్నదే. 

జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తోంది, కానీ మనుష్యులైన మనము అయన ఆజ్ఞలు పాటించకుండా, పవిత్రతను కోల్పోయి అయన సన్నిధికి దూరం అయిపోతున్నాము.  యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆ ఘోర సిలువలో నరక యాతన అనుభవించి, మనకు ఇచ్చిన పాప క్షమాపణను కోల్పోతున్నాము.  అపొస్తలుడయినా పౌలు గారు థెస్సలొనీకయులకు రాసిన పత్రికలో, పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా ఇలా రాస్తున్నారు. 

థెస్సలొనీకయులకు 4: "7.  పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. 8.  కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు."

దేవుడు మనలను పిలుచుకుంది పవిత్రులుగా ఉండాలని, కానీ లోక రీతులతో నిత్యము చెడు తలంపులతో శోదించబడుతూ, సాతాను సంబంధులుగా ఉండటానికి కాదు. ఒక్క వెళ అలా ప్రవర్తించేవారు, పాస్టర్లు చెప్పే ప్రసంగాలు కాదు మనుష్యులు చెప్పే నీతులు కాదు గాని దేవుడినే నిర్లక్యం చేస్తున్నారు. 

ప్రభువు నందు ప్రియమయిన మీకందరికి ఆయన పేరిట నేను చేస్తున్న మనవి, లోకముతో సంబంధం వదిలి పెట్టండి. సినిమాలు, టీవీ సీరియల్స్, మరియు మానసికంగా మనలను బలహీన పరచి శోధించే ప్రతి దానికి దూరంగా ఉండండి. అదే విధంగా తాగుడు, తిరుగుబోతు తనం, చెడ్డ స్నేహములు విడచి దేవునికి ఇష్టమయిన వారిగ ఉండండి. 

దావీదు "దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించు వాడు  ధన్యుడు" అని రాశాడు. మరో కీర్తనలో "దేవుని వాక్యము తన పాదములకు దీపముగా ఉన్నదని" అంటాడు. అయన వాక్యము మన హృదయాంతరాలలో ఉన్న చీకట్లు తొలగించి క్రీస్తు వెలుగులోకి  నడిపిస్తుంది. అయన సన్నిధి మనలను హృదయశుద్ధి గలవారిగా మార్చి దేవుణ్ణి చూచె తేట చూపును పొందుకునెలా చేస్తుంది. అనగా దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఉంటాము, అప్పుడు దేనికి చింతపడని వారిగా మారిపోతాము. ముఖ్యంగా దేవుణ్ణి సంతోష పెట్టె వారిగా మన నడక మారుతుంది. కొన్ని నిముషాలు లేదా  ఒక గంట మహా అయితే ఒక పూట లోక పరమయిన సంతోషం కోసం,  దేవుణ్ణి సంతోష పెట్టె గొప్ప అవకాశం వదులుకుంటామా! సందర్భానుసారమయిన ఈ క్రింది పాటను వినండి! ప్రేరణ పొందండి!! దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

10, అక్టోబర్ 2020, శనివారం

దేవుని సార్వభౌమాధికారం


పవిత్రగ్రంథం బైబిల్ లో ఎంతోమంది గొప్ప  విశ్వసాము చూపుట ద్వారా దేవుని నామమును ఘన పరిచారు. తమ మొక్కవోని ధైర్యముతో ప్రతికూల పరిస్థితులను ఎదిరించి దేవుని కృపకు పాత్రులయ్యారు. తాము నమ్మిన దేవుడు సజీవుడు అని అప్పటి సమాజానికి చాటి చెప్పారు. అంటువంటి వారిలో దానియేలు ప్రవక్త ఒక్కరు. 

ఇశ్రాయేలు జనమును దేవుడు బబులోను రాజయిన నెబుకద్నెజరు కు అప్పగించినప్పుడు, కొంతమంది యూదా యువకులను తన సామ్రాజ్యానికి తీసుకెళ్లి, వారికి విద్యలు నేర్పి తన కొలువులో ఉంచుకోవాలనుకున్నాడు. ఆవిధంగా కొనిపోబడిన వారిలో దానియేలు ప్రవక్త ఒక్కరు. అతను యుక్త వయసులోనే పరాయి రాజ్యంలో బానిసలాగా బ్రతకటానికి వెళ్ళిపోయాడు. అతని తో పాటు ఎంతో మంది యూదులు ఉన్నప్పటికి, దేవుని గ్రంథం  మరో ముగ్గురికి మాత్రమే తనలో  స్థానం కల్పించింది. వారి యూదా దేశపు పేర్లు వేరే ఉన్నప్పటికీ బబులోను సామ్రాజ్యంలో వారి అధిపతి పెట్టిన పేర్లు మాత్రం షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగో. 

దానియేలు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అతను పరాయి రాజ్యంలో బానిసలాగా బ్రతుకుతున్నాడు. తాము నమ్మిన దేవుడు, తమకు విజయం ఇవ్వకుండా ఇలా పరాయి రాజు పాలనా క్రిందికి తమను తీసుకొచ్చాడు, అని అలోచించి వేధన పడవచ్చు, దేవుని శక్తిని శంకించ వచ్చు. లోక రీతిగా ఆలోచిస్తే అది సాధారణమయిన విషయం కూడా! కానీ దానియేలుకు  దేవుని మీద అపారమయిన విశ్వాసం ఉంది. అయన కార్యముల పట్ల భయభక్తులున్నాయి. అందుకే ఎట్టి పరిస్థితిలోను తన దేవుని ఆజ్ఞలు మీరకుండా  తన పవిత్రతను కాపాడుకోవాలనుకున్నాడు. 
 
దానియేలు 1: "5. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను."

పై వచనంలో చూసినట్లయితే రాజాజ్ఞ ప్రకారం, వారి అధిపతి రాజు తినే ఆహారమును, మరియు ద్రాక్ష రసమును  వారికి ఇవ్వజూపినప్పుడు, దేవుని  నియమములకు వ్యతిరేకమయిన ఆ ఆహారమును తినటానికి దానియేలు నిరాకరించాడు. తన తోటి వారికి ఆదర్శంగా నిలిచి, వారి విశ్వాసమును వెలికి తీసాడు. తమ అధికారికి "పది రోజులు తమకు ఆ ఆహారం ఇవ్వకుండా పరీక్షించమని" విజ్ఞాపన చేశాడు. 

దానియేలు 1: "15. పది దినములైన పిమ్మట వారి ముఖ ములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా 16. రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షా రసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను." 

తర్వాత జరిగిన అద్బుతము, దేవుడు వారిని మంచి భోజనము తిన్న వారికన్నా అందంగా మార్చాడు. వారి విశ్వాసము చొప్పున దేవుడు అద్భుత కార్యమును జరిగించాడు. ఇక్కడ దానియేలు నుండి మనం దేవుని పై గొప్ప  విశ్వాసము, అయన వాక్యానుసారముగా జీవించాలన్న దృఢ సంకల్పము నేర్చుకోవాలి. అదేవిధంగా  దేవుని అధికారమును, అయన చిత్తమును అంగీకరించి అన్ని వేళలో లోబడి ఉండే  స్వభావమును కూడా.  

తర్వాత ఇదే గ్రంథం లో కనిపించే మరొక సంఘటన కూడా మన విశ్వాసమును బలపరచటమే కాకుండా, దేవుని అద్భుత కార్యమును బయలు పరచి అన్యులను సైతం మన దేవుణ్ణి అంగీకరింప జేస్తుంది. 

రాజయిన నెబుకద్నెజరు ఒక గొప్ప బంగారు దేవత విగ్రహమును చేయించి,  తన రాజ్యంలో ఉన్న అందర్నీ దానికి సాగిలపడి మ్రొక్కమని ఆజ్ఞాపించినప్పుడు, జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగో లు నిరాకరించారు. ఉగ్రరూపుడయిన ఆ రాజు వారిని మండుచున్న అగ్ని గుండములో పడవేస్తానని బెదిరించినపుడు వారు పలికిన మాటలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి.  దానియేలు గ్రంథం మూడవ అధ్యాయంలో ఆ సంఘటనను మనం అధ్యయనం చెయ్యవచ్చు. 


దానియేలు 3: "16. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరినెబుకద్నెజరూ,యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు. 17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను 18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము."
 
పై వచనంలో చూసినట్లయితే ఆ ముగ్గురు విశ్వాసులు రాజ్ఞనను ధిక్కరించారు, దేవుని మీద గొప్ప  విశ్వాసమును చూపించారు. అయితే కాస్త లోతుగా విషయమును పరిశీలిస్తే మరి కొన్ని మంచి  విషయాలు మనం నేర్చుకొనే అవకాశం ఉంది. 

రాజీపడని మనస్థత్వం: దేవుని వాక్యం మనలో దీనత్వం, తగ్గింపుతనం ఉండాలని చెపుతుంది, కానీ ఈ రాజీపడని మనస్థత్వం ఏమిటీ? పైన జరిగిన సంఘటనలో షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఇతర దేవత  విగ్రహముకు  సాగిలపడవలెనని రాజాజ్ఞ వచ్చింది. కానీ జీవము గల దేవుని ఆజ్ఞల ప్రకారం  వారు ఏ విధమయిన విగ్రహములను, మరియు ఇతర దేవతలను పూజించ రాదు. వారు రాజీపడి ఆ విగ్రహమునకు మొక్కినట్లయితే తమ దేవుని ఆజ్ఞలు మీరినట్లే.  తమ ప్రాణములకు ప్రమాదం ఉన్నదని తెలిసినా, దేవుని ఆజ్ఞను మిరకూడదని, తమ ఆత్మీయతకు భంగం కలగరాదని వారు రాజాజ్ఞను సైతం  లెక్క చెయ్యలేదు. అంటువంటి రాజీపడని తత్వం మనలో ఉందా? వారిలాగా ప్రాణాలకు తెగించవలసిన సందర్భం లేకపోయినా, స్వల్పమయిన విషయాలలో రాజీపడిపోయి మన ఆత్మీయ జీవితాన్ని చల్లార్చుకుంటూ ఉంటాము. లోకపరమయిన స్నేహాల కోసం, అందరు చేస్తున్నారులే అన్న నిర్లక్ష్యంతో దేవుని వాక్యానికి విరుద్దమయిన ఎన్నో పనులు అవలీలగా రాజిపడి చేసేస్తాం. దేవునికి మనకు మధ్య దూరం పెంచేది, మన ఆత్మీయతను ప్రశ్నార్థకం చేసేది ఎటువంటిదయినా పాటించకుండా, ఎంత గొప్ప వారికయినా లొంగిపోకుండా ఉన్నప్పుడు, దేవుడే మన పరిస్థితులు చక్కబెడుతాడు. దానికి ఉదాహరణ, రాజు యొక్క ఆహారం విషయంలో దానియేలు తమ అధికారిని  బ్రతిమాలుకున్నప్పుడు అతనికి వారి పట్ల కనికరం కలిగేలా చేసింది దేవుడే అని వాక్యం స్పష్టంగా తెలుపుతోంది. 

దానియేలు 1: "8. రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా  9. దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను ..."

పరిస్థితులను అనుకూలంగా మార్చే దేవుని శక్తిని నమ్మి, మనలను ఆయనకు దూరం చేసే ఏ విషయములోనయిన రాజీపడకుండా జీవించే మనస్థితిలో మనం ఉన్నామా? ఈ ఒక్కసారే కదా అని లొంగిపోతున్నామా? 

స్థిరమైన విశ్వాసం: ఈ సంఘటనలో ఈ ముగ్గురు విశ్వాసులు దేవుని శక్తిని సంపూర్ణంగా నమ్ముతున్నారు.  అయన తమను అగ్నిగుండంలో నుండి కాపాడగలిగిన సమర్థుడు అని విశ్వసించారు. ఈ విశ్వాసము వారికి ఎలా వచ్చింది? దేవుని ఆజ్ఞలను వారు తుచ తప్పకుండా పాటిస్తున్నారు కనుకనే అని చెప్పుటలో సందేహం లేదు. యోబు తన శ్రమల కాలంలో చెప్పిన మాటలు ఈ ముగ్గురి పట్ల జరిగిన సంఘటనకు ఆపాదించుకోవచ్చు. 

యోబు 23: "10. నేను నడచుమార్గము ఆయనకు తెలియునుఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును."

పై వచనంలో యోబు దేవుడు  తన మీదికి  శోధన అనుమతించిన  తర్వాత బంగారము వలె కనబడుతానని అంటున్నాడు. మరొక చోట యోబు అంటాడు "నా విమోచకుడు సజీవుడు" అని. మనందరికీ తెలిసిన విషయం, బంగారమును అగ్నిలో వేసి కరిగించి శుద్ధి చేస్తారు. ఇక్కడ కూడా ఈ ముగ్గురిని రాజయిన నెబుకద్నెజరు అగ్ని గుండములో పడవేస్తానంటున్నాడు. మన జీవితాల్లో కూడా కష్టాల కొలిమి ఒక్కోసారి ఎక్కువగా  మండవచ్చు. మనం నడుస్తున్న బాట భారంగా అనిపించవచ్చు. కాని మన దేవునికి మన మార్గము తెలుసు. మనకన్న ముందుగానే మన అవసరతలు తెలుసు. దేవుని మీద విశ్వాసం ఉంచి, అయన శక్తిని నమ్ముకొని సాగిపోవటం అలవాటు చేసుకోవాలి.  ఎందుకంటే మన దేవుడు సజీవుడు, మాట్లాడలేని బంగారుతో చేసిన విగ్రహం కాదు.  ఈ  విషయము ఎరిగిన వారు కనుకనే షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోలు తమ దేవుడి మీద అపారమయిన విశ్వాసం చూపుతున్నారు. వారితో పాటు ఉన్న ఇతర యూదులు వారిలాంటి విశ్వాసం చూపించలేక పోయారు.  అపొస్తలుడయినా పౌలు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో  హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో  విశ్వాసము గురించి ఎంతో గొప్పగా వివరించారు. 

హెబ్రీయులకు 11: "1. విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది."

హెబ్రీయులకు 11: "6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా."

పైనున్న మొదటి వచనంలో స్పష్టంగా విదితం అవుతున్న విషయం, "మనం ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం.   కనిపించని వాటికి రుజువులు వెతకకుండా ఉండటమె విశ్వాసం". అదే విధంగా మరో వచనంలో  "విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టటం అసాధ్యం. తనను నమ్ముకున్న వారికి తగిన రీతిలో మేలు చేయువాడు ఆయనే". ఈ ముగ్గురు వ్యక్తులు అదే విధమయిన విశ్వాసమును చూపిస్తున్నారు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, వారివంటి విశ్వాసం కలిగి ఉన్నామా? దేవుని శక్తిని శంకించకుండా ఉండగలుతున్నామా?   లేక దేవా అసలు చెయ్యగలవా అని ప్రశ్నిస్తున్నామా? ప్రశ్నించిన ప్రతిసారి విశ్వాసంలో ఒక్క మెట్టు కిందికి జారుతున్నామని ఎరిగిన వారాం కావాలి. 

దేవుని చిత్తము అంగీకరించటం: ఇక్కడ షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోల విశ్వాసం ఎంత గొప్పదయినా దేవుని చిత్తమును దాటి పోవటం లేదు. దేవుడు తమను కాపాడే సమర్థుడు అనే  విశ్వాసముతో  పాటు ఒక వేళ కాపాడక పోయిన చింత లేదు అని సమాధానం ఇస్తున్నారు. వారి విశ్వాసములో దేవుని చిత్తమును అంగికరిస్తున్నారు. ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నం కదా! దేవుడు తమను తప్పకుండా కాపాడాలి అన్న ఎదురుచూపు వారిలో లేదు. కానీ దేవుని చిత్తమునకు తమ పరిస్థితిని అప్పగించుకున్నారు. దేవుని చిత్తమును అంగీకరించే మనసు మనకు ఎప్పుడు వస్తుంది? ఆయన కార్యములు మన కోరికలకన్నా ఉన్నతమయినవి, గంభీరమయినవి అని మనం నమ్మినప్పుడు. అది కూడా విశ్వాసము మూలంగానే సాధ్యం అయింది.  మనం అటువంటి స్థితిలో ఉన్నామా? మనం అనుకున్నది ఒక్క పని జరగక పోతేనే ఎంతగానో చింతిస్తాం, దేవుని ఉనికిని ప్రశ్నించటానికి కూడా సాహసిస్తాం. మనస్ఫూర్తిగా ప్రార్థించటానికి కూడా కష్టపడతాం! మన కోరికలు ఏమయినా గాని, మనం ఎంతగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న గాని, ఎంత ప్రార్థన పరులమయిన గాని, అయన చిత్తమును అంగీకరించి జీవిద్దాం. అయన  మన అవసరములను బట్టి, తగు సమయములో  మనకు మేలు చేయు కార్యములు చేయ సమర్థుడుగా ఉన్నాడు.

-: దేవుని అద్బుత కార్యము :-

దానియేలు 3: "20. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించిషద్రకును, మేషా కును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా 21. వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్ర ములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి. 22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి. ​ 23. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మను ష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా 24. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచిమేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితివిుగదా యని తన మంత్రుల నడి గెను. వారురాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.  25. అందుకు రాజునేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను."

పై వచనములను అధ్యయనం చేస్తే దేవుని గొప్ప కార్యములను మనం చూడవచ్చు. తన ఆజ్ఞను దిక్కరించారని రాజయిన నెబుకద్నెజరు షద్రకు, మేషాకు ఇంకా అబేద్నెగోలను అగ్ని గుండములో పడ వేయించాడు. ఆ అగ్ని దాటికి వారిని పడవేసిన వారు కాలి పోయారు గాని, అగ్నిలో పడ్డ వారు మాత్రం నశించిపోలేదు. మన పక్కన వెయ్యిమంది కూలినా దేవుడు మనలను మాత్రం పడిపోనివ్వడు అనటానికి నిదర్శనంగా లేదూ! 

వారికి కట్టిన బంధకములు వీడి పోయాయి, వారు స్వేచ్చ గా అగ్నిగుండములో సంచరిస్తున్నారు. దేవుని చిత్తములో ఉంటె మన శోధనల్లో సైతం ఏ బంధకములు లేని వారిగా సంతోషముగా తిరుగుతాం, ఎందుకంటే  దేవుడు ఆ శోధనల్లో మనతో పాటు ఉంటాడు. మన బందకాలను విడిపించి, ఆ శోధనలు మనలను నశింప జేయకుండా కాపాడుతాడు. మన స్థిరమయిన విశ్వాసం, నీతివంతమయిన ప్రవర్తన, అయన చిత్తమును అంగీకరించే తత్వం మన జీవితాల్లో అయనచే గొప్ప కార్యములు చేయిస్తాయి. ఈ శోధనలు  మనలను స్వచ్చమయిన బంగారము వలె మార్చి, మన విశ్వాసము గొప్పగా బలపరచి,  దేవుని కృపకు మరింత దగ్గరగా చేరుస్తాయి.  

దానియేలుకు మొదట దేవుడు చేసిన అద్భుతం "మంచి ఆహారం తిన్నవారికంటే, వారందర్ని అందముగా మార్చటం". దీన్ని బట్టి చూస్తే, మన అవసరమును బట్టి దేవుడు తన కార్యములు జరిగిస్తాడు. దానియేలు బృందం పరిశుద్దతను కాయటానికి, వారి విశ్వాసమును బట్టి వారి జీవితాల్లో అద్భుత కార్యం జరిగించాడు. అటువంటి కార్యములు మన జీవితాల్లో కూడా చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు.  ఇక్కడ మన తెలివితో, సామర్థ్యంతో పనిలేదు, మనం ఉన్న పరిస్థితులు ఏవయినా పర్వాలేదు, వాటిని మార్చి మనలను ఉన్నంతగా నిలిపే సమర్థుడు మన దేవుడు. 

మన ఆత్మీయ సాక్ష్యమును కాపాడుకుంటూ, అయన సామర్థ్యమును విశ్వసిస్తూ, అయన చిత్తమును కనిపెట్టుకుని ఉంటే, ప్రతి శోధన నుండి కాపాడి,  మనలను గొప్పగా దీవించటానికి అయన ఎప్పుడు ఆలస్యం చేయని దేవుడు. ఇక్కడున్న నలుగురు దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించలేదు! అక్కడినుండే వారి విశ్వాసం మొదలయింది. అయన శక్తిని శంకించలేదు కనుకనె వారి విశ్వాసం చెక్కుచెదరనిదిగా రూపుదిద్దుకుంది. దేవుని శక్తిని చాటి, అన్యుల ముందు అయన  నామమునకు ఘనత తెచ్చింది.   దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం  మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

4, అక్టోబర్ 2020, ఆదివారం

పరిచర్యలో దీనత్వం ఉందా?

ప్రభువయిన యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించకున్న తర్వాత, ప్రతి విశ్వాసి ఆశపడేది! అయన సేవలో వాడబడాలని. ఎందుకంటే దేవుడు పౌలు భక్తుని ద్వారా స్పష్టంగా  రాయించిన సత్యాలు ప్రతి విశ్వాసి లో  అటువంటి ఆలోచనలు,  ఆశలు కలగటానికి ప్రేరేపిస్తాయి.  పవిత్ర  గ్రంధమయిన  బైబిల్ లో చూసినట్లయితే అపొస్తలుడయిన పౌలు గారు కొరింథీయులకు  రాసిన మొదటి  పత్రికలో చాల విషయాలతో పాటు 12 వ అధ్యాయంలో ఆత్మసంబంధమైన వరములను గురించి చాల వివరంగా రాసియున్నారు. 

1 కొరింథీయులకు 12: "10. మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. 11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు."

పై వచనములలో స్పష్టంగా చెప్పబడుతున్న సంగతులు, క్రీస్తు  సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై ప్రభువు తనను విశ్వసించిన వారికి తమ  విశ్వాసమును బట్టి కృపావరములు అనుగ్రహిస్తున్నాడు. అందులో ఎన్నో ఆత్మీయ వరములు తెలుపబడి ఉన్నాయి. పౌలు గారు ఈ పత్రికలో కొరింథీ సంఘములో, ఆ సమయంలో జరుగుతున్న అపార్థములను విశదీకరించారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం కూడా ఎన్నో సంఘములలో అంటువంటి అపార్థములు జరుగుతున్నాయి. సంఘమును నడిపే వారు సంఘము యొక్క క్షేమాభివృద్ధి  కొరకు కాకుండా తమను తాము ఘన పరచు కోవటానికి, ప్రజలను ఆకర్షించటానికి, ఈ కృప వరములను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా లేని స్వస్థత వరములను ప్రదర్శిస్తూ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశ్యములయినా మారు మనసు, పాప విమోచన మరియు  నిత్య జీవము అనే గొప్ప బహుమతులకు ప్రాముఖ్యం లేకుండా చేస్తున్నారు. 

దేవుడు స్వస్థతలను ఇస్తాడు, మరియు తనను నమ్ముకున్న వారికి క్షేమాభివృద్ధిని  కలిగిస్తాడు. కానీ అవి మాత్రమే పొందుకోవటానికి దేవుణ్ణి విశ్వసిస్తే, డబ్బు  సంచిని ఆశించి యేసయ్యను వెంబడించిన ఇస్కరియోతు  యూదాకు, మనకు  ఏవిధమయిన తేడా లేదు. దేవుడు ఎప్పుడయినా అల్పులను మరియు అభాగ్యులను హెచ్చించి తన పనిలో పాత్రలుగా వాడుకున్నాడు. ఎందుకంటే వారిలో ఉన్న  దీనత్వమును బట్టి మరియు పూర్తిగా దేవుని పైన ఆధారపడ్డారు కాబట్టి. దేవుడు  ప్రతి విశ్వాసిని క్రీస్తు దేహమయిన సంఘములో ఒక అవయవముగా చేసుకొని ఉన్నాడని పౌలు గారు స్పష్టంగా వివరిస్తున్నారు. సంఘము లో అభివృద్ధి జరగటానికి ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పగించి ఉన్నాడు. ఆ బాధ్యతల ఫలితమే ఈ  కృపావరములు లేదా తలాంతులు అని ప్రతి ఒక్కరం గ్రహించుకొని, వాటిని దేవుని నామ ఘనతార్థమై మాత్రమే ఉపయోగించాలి.  

దేవుడు జంతువులలో  ఎంతో అల్పమయిన గాడిదను మరియు పక్షులలో ఎంతో అల్పమయిన కాకిని సైతం తన పనిలో వాడుకున్నాడు. చెడిపోయిన ప్రవక్త బిలామును హెచ్చరించటానికి గాడిదకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. అంతే కాకుండా మొదటి సారి యేసు క్రీస్తు ప్రభువుల వారు బెత్లెహేము నుండి యెరూషలేముకు వస్తున్న సమయంలో దాన్ని అధిరోహించారు. అదేవిధంగా జల ప్రళయం తర్వాత నొహవు బయటకు పంపితే మాంసమునకు ఆశపడి  శవములను తింటూ  వెనుకకు రాని కాకిని తన ప్రవక్త అయిన ఎలియా ఆకలి తీర్చటానికి వాడుకున్నాడు.  పైన చెప్పుకుంటున్న సంఘటనలలో గాడిద ఎంత అల్పమయినది అయినప్పటికి దేవుడు దానికి మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆ ప్రవక్తను హెచ్చరించటానికి. ఆ విధంగా తన పనిని ఆ గాడిద ద్వారా జరుపుకున్నాడు. అదేవిధంగా మొదట మాంసానికి  కక్కుర్తి పడి వెనుకకు రాకుండా  తనకు ఇచ్చిన బాధ్యతను  నెరవేర్చని కాకిని సైతం దేవుడు వాడుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమయిన మాంసమును తినకుండా ప్రవక్త కడుపు నింపే ఆ బుద్దిని దేవుడే కాకికి ఇచ్చాడు అనటంలో ఏ సందేహం వలదు.  అటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ప్రతి విశ్వాసికి ఇస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా చెపుతోంది. కానీ దేవుడు తన సంఘము పనిలో మనలను బాగస్తులుగా చేసుకోవటానికి ఇచ్చిన ఈ ప్రతిభ, సామర్థ్యం మన గొప్పే అనుకోవటం, గర్వపడటం మన ఆత్మీయ జీవితానికి మేలు చేస్తుందా? 

విశ్వసంలో మనం శిశువులుగా ఉన్నపుడు ఉండే తగ్గింపు, కాస్త అనుభవం రాగానే నెమ్మదిగా మనలో తగ్గిపోవటం మొదలవుతుంది.  ఒక వేళ దేవుని శక్తి మూలంగా  మాట్లాడే సామర్థ్యం  పొందిన గాడిద దేవుడు చెప్పమన్న  మాటలు పలుకకుండా తన ఇష్టానుసారం పలికితే! అన్ని జంతువుల కన్నా తాను ఎంతో గొప్పదని తలిస్తే! ఎంత ముర్కత్వం? అదే గాడిద యేసు క్రీస్తు తనను అధిరోహించినప్పుడు ప్రజలంతా తన  ముందు నాట్యమాడుతూ, తమ వస్త్రములు పరుస్తున్నారని, తనను వారు ఆరాధిస్తున్నారనుకుని విర్ర విగితే? ఆ గాడిద గుర్తించ వలసిన విషయం ఏమిటంటే దేవుని పలుకులు పలికినంత వరకే తనకు మాట్లాడే సామర్థ్యం, యేసు క్రీస్తును తాను మోసినంత వరకే తన ముందు ప్రజలు నాట్యమాడేది, హర్ష ధ్వనాలు చేసేది.

ఒక్కసారి మనలో దీనత్వం దూరం అయితే మన  ప్రతిభ, సామర్థ్యం ఎంత మాత్రం ఆశీర్వదింప బడలేవు. ఏవో వాణిజ్య ప్రకటనలు ఉపయోగించి ప్రజలను మభ్య పెట్టవచ్చు గాక! కానీ మనం  చేసే పనులు దేవునికి ఇష్టం ఉండదు, సంఘ అభివృద్ధికి ఎంత మాత్రం ఉపయోగపడవు. దేవుని పాత్రగా వాడబడాలని ఆశపడే సహోదరి, సహోదరుడా మన  సామర్థ్యం దేవుడు తన పని కోసం ఇచ్చినదే కానీ, మనలను మనం  ఘనపరచు కోవటానికి,  గర్వపడటానికి కాదని తెలుసుకోవాలి. అయన హస్తం మన మీద ఉన్నంత వరకె మనం ఏం చెప్పిన, ఏం పాడిన  విశ్వాసులకు కోకిల స్వరంల వినపడుతుంది లేదంటే కాకి అరుపులుగా మిగిలి పోతుంది. 

యాకోబు 4:6 "....అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది."

దేవుని వాక్యం ఎన్నో సార్లు చాల స్పష్టంగా చెపుతున్న మాట గర్విష్ఠులను దేవుడు ఏమాత్రం అంగీకరించడని. నాశనమునకు ముందు గర్వం వస్తుందని. యాకోబు గారు రాసిన పత్రికలో పైన వచనము చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. దేవుడు ఇచ్చిన తలాంతులు అయన ఘనత కోసం వాడండి, దీనత్వాన్ని వదిలి పెట్టకుండా, గర్వమును దరిచేర్చుకోకుండా ప్రభువు చిత్తమును నెరవేర్చండి. సంఘము క్షేమాభివృద్ధికై పాటు పడండి. మనం కాకపోతే మరొకరిని దేవుడు లేపుతాడు తన కార్యములు జరుపుకుంటాడు. గర్వపడి, దీనత్వమును విడచి  గొప్ప దేవునికి మీ పట్ల  ఉన్న  ఉద్దేశ్యమును కోల్పోకండి. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం  మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!